Paatal Lok Season 2 Review in Telugu: పాతాళ్ లోక్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జయదీప్ అలావత్ (Hero)
  • ఇశ్వాక్ సింగ్ (Heroine)
  • తిలోత్తమ షోమ్, నగేష్ కుకునూర్ తదితరులు.. (Cast)
  • అవిన్ష్ అరుణ్ ధావరే (Director)
  • కర్నేశ్ శర్మ - బబితా అశివాల్ (Producer)
  • నరేన్ చందవర్కార్ - బెనెడిక్ట్ టైలర్ (Music)
  • అవినాష్ అరుణ్ ధావరే (Cinematography)
  • Release Date : జనవరి 17, 2025

కరోనా టైంలో విడుదలైన హిందీ వెబ్ సిరీస్ “పాతాళ్ లోక్” (Paatal Lok Season 2) ఒక సెన్సేషన్. ఒక సిల్లీ కాన్ ఫ్లిక్ట్ పాయింట్ తో.. సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లింగ్ డ్రామాను ముగించవచ్చు అని నిరూపించిన సిరీస్ ఇది. ఇండియన్ డిజిటల్ స్పేస్ లో టాప్ 5 సిరీస్ లో “పాతాళ్ లోక్” కచ్చితంగా టాప్ పొజిషన్ లో ఉంటుంది. అటువంటి బ్లాక్ బస్టర్ సిరీస్ సెకండ్ సీజన్.. దాదాపు 5 ఏళ్ల తర్వాత నేడు (జనవరి 17, 2025) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. 8 ఎపిసోడ్ల ఆసక్తికరమైన ఈ సిరీస్ ఎలా ఉంది? ఈసారి హాతిరాం చౌదరి చేసిన సాహసం ఏమిటి? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేది చూద్దాం..!!

Paatal Lok Season 2 Review

కథ: ఢిల్లీని వణికించిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా కేస్ డీల్ చేసిన హాతిరాం చౌదరి (ప్రదీప్ అలావత్) మళ్లీ తన స్టేషన్ లో ఎప్పట్లానే చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తుండగా.. తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చిన వివాహిత మరియు ఆమె కొడుకుని చూసి కదిలిపోయిన హాతిరాం, తప్పిపోయిన రఘు పాశ్వాన్ (శైలేష్ కుమార్) కోసం వెతకడం మొదలెడతాడు.

ఊహించని విధంగా నాగాల్యాండ్ కు చెందిన ఓ డెలిగేట్ అత్యంత దారుణంగా హతమార్చబడతాడు. ఆ కేస్ ను ఐపీఎస్ అన్సారి (ఇశ్వాక్ సింగ్) డీల్ చేస్తుంటాడు. హాతిరాం & అన్సారీ కలిసి నాగాల్యాంగ్ వెళతారు. అక్కడ కేస్ ను డీల్ చేస్తుండగా, అనుకోని అడ్డంకులు తలెత్తుతాయి. నాగా ల్యాండ్ డెలిగేట్ ను చంపింది ఎవరు? ఆ హత్యతో రఘుకి సంబంధం ఏమిటి? ఈ కేసును హతీరాం చౌదరి ఎలా డీల్ చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పాతాళ్ లోక్ సీజన్ 2”

నటీనటుల పనితీరు: నటుడిగా జయదీప్ అలావత్ సత్తా ఏమిటి అనేది మొదటి సీజన్ లో ఆల్రెడీ చూసాం. సెకండ్ సీజన్ లో అంతకుమించిన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తన పాత్రను క్యారీ చేయడంలో జయదీప్ చూపించే పరిణితి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రెండు కోట్ల రూపాయల నుండి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకొని, అవి కూడా రఘు కొడుక్కి ఇచ్చి.. గర్వంగా నవ్వుతూ రైల్వే స్టేషన్ నుండి బయటికి వెళ్లే సీన్ లో జయదీప్ నటన సిరీస్ మొత్తానికి హైలైట్.

మొదటి సీజన్ లో సాధారణ పోలీస్ అధికారి ఇమ్రాన్ అన్సారీగా కనిపించిన ఇశ్వాక్ సింగ్.. సెకండ్ సీజన్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా అలరించాడు. అతడి పాత్రలో నిజాయితీతోపాటు అమాయకత్వం కనిపిస్తుంది. మరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా తిలోత్తమ చాలా సహజంగా నటించింది. నగేష్ కుకునూర్ ఓ బిజినెస్ మ్యాన్ గా కనిపించాడు. అనురాగ్ అరోరా, గుల్ పనాగ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సుదీప్ శర్మ రైటింగ్ ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. మొదటి సీజన్లో ఎండింగ్ తో ఈ సిరీస్ ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. హతోడా త్యాగి ఎందుకని సంజీవ్ మెహ్రాను హత్య చేయకుండా వదిలేశాడు అనే కీలకమైన పాయింట్ కు సుదీప్ ఇచ్చిన రీజన్ కి మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పాలి. అలాంటి సుదీప్.. సెకండ్ సీజన్ ను చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. ముఖ్యంగా నాగా ల్యాండ్ ఎపిసోడ్స్ & కీ ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం బాగుంది. ఒక రచయితగా క్యారెక్టర్ ఆర్క్స్ ను ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం.

దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అవిన్ష్ అరుణ్ ధావరే సిరీస్ ను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. దాదాపు 25 సినిమాల అనుభవం గల సినిమాటోగ్రాఫర్ కావడంతో.. ఫ్రేమింగ్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ప్రతి ఎపిసోడ్ ముగింపు రోజ్ పాత్రకు సంబంధించిన కీలకమైన అంశంతో ఎండ్ చేయడం, నాగా ల్యాండ్ పాలిటిక్స్ & ఇండియన్ పాలిటిక్స్ ను కనెక్ట్ చేయడం వంటివి అలరిస్తాయి.

ఇక పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ ను చూపించిన విధానం ఆసక్తి రేపుతుంది. అయితే.. మొదటి సీజన్ చాలా రియలిస్టిక్ గా ఉండగా, సెకండ్ సీజన్ కి వచ్చేసరికి కాస్త పాలిష్ చేసారు, అందువల్ల ఫ్యామిలీ మ్యాన్ ఎఫెక్ట్ గట్టిగా కనిపించింది. అందుకు కారణం మొదటి సీజన్ లో కనిపించిన స్థాయి రా & రియలిస్టిక్ సీన్స్ లోపించడమే. ముఖ్యంగా.. మొదటి సీజన్ లో విశేషంగా హైలైట్ అయిన హతోడా త్యాగి లాంటి పవర్ ఫుల్ విలన్ రోల్ సెకండ్ సీజన్ లో లోపించడం కూడా మరో కారణం అని చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి. కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. యాక్షన్ బ్లాక్స్ ను వీలైనంత రియలిస్టిక్ & లాజికల్ గా డీల్ చేసారు.

విశ్లేషణ: వెబ్ సిరీస్ లలో ఈ మధ్యకాలంలో బూతులు, శృంగార సన్నివేశాలు ఎక్కువైపోయి.. కథ, కథనాల మీద శ్రద్ధ తక్కువైపోతుంది. ఆ లోటును తీర్చి కథ-కథనంతోపాటు మంచి క్యారెక్టర్ డిజైన్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్న సిరీస్ “పాతాళ్ లోక్” (Paatal Lok Season 2). సెకండ్ సీజన్ కూడా మొదటి సీజన్ స్థాయిలో ఆకట్టుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. హాతిరాం చౌదరి పాత్ర ప్రేక్షకుల మనసుల్లో కొన్నాళ్లు ఉండిపోతుంది. అలాగే.. రెగ్యులర్ థ్రిల్లర్స్ కు భిన్నంగా ఈ సిరీస్ లో ట్విస్టులను రివీల్ చేసి, వాటికి సమాధానాలు చెప్పే విధానం విశేషంగా అలరిస్తుంది.

ఫోకస్ పాయింట్: మంచి బింజ్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus