జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. మతం అడిగి మరీ పర్యాటకులపై దాడి చేసి 28 మందిని హతమార్చిన ఈ ఘోరం, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. ఇదే నేపథ్యంలో బాలీవుడ్ లో మే 9న విడుదల కానున్న అబీర్ గులాల్ (Abir Gulaal) సినిమాపై నిషేధం వేయాలన్న డిమాండు ఊపందుకుంది. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన నటుడు ఫవద్ ఖాన్ (Fawad Khan) ప్రధాన పాత్రలో నటిస్తుండటం వివాదాస్పదంగా మారింది.
ఈ సినిమాలో వాణి కపూర్ (Vaani Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, దర్శకురాలు ఆర్తి ఎస్ బాగ్ది మెగాఫోన్ పట్టారు. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై సున్నిత అంశాలపై చర్చలకు దారితీసింది. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ‘పాకిస్థానీ నటుడు నటించిన సినిమా మన దేశంలో ఎలా విడుదల అవుతుందని?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ట్విట్టర్‌లో #BanAbirGulal హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫవద్ ఖాన్ గతంలో ‘ఖూబ్సూరత్’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘ఏ దిల్ హై ముష్కిల్’ వంటి హిందీ చిత్రాల్లో నటించి, తరువాత పాకిస్థాన్‌కు తిరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ దాడుల నేపధ్యంలో అతనిపై మళ్లీ వ్యతిరేకత పెరిగింది. అతను ఇప్పటివరకు ఈ దాడిపై స్పందించకపోవడం కూడా నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ వర్గాలు ఈ సినిమా విడుదలపై పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని, అబీర్ గులాల్ విడుదల వాయిదా వేయొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఫవద్ ఖాన్ స్పందన లేకపోతే ఈ వివాదం మరింత ముదిరే అవకాశముంది.