“తెలుగువారు గర్వపడే సినిమా” అంటూ ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా హల్ చల్ చేస్తున్న చిత్రం “పలాస”. “లండన్ బాబులు” ఫేమ్ రక్షిత్ కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్స్ తోనే ఆసక్తిని భారీగా పెంచేసింది. 1978 కాలంలో పలాస గ్రామంలో చోటు చేసుకున్న రాజకీయ, కుల, మత విద్వేషాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: ఎగువ జాతి, దిగువ జాతిల నడుమ నీళ్ల కోసం కొట్లాటలు జరుగుతున్న రోజులవి. మోహన్ రావు (రక్షిత్) మరియు అతని అన్నయ్య రంగారావు ఈ కట్టుబాట్లను, ఊరి పెద్దలను ఎదిరించి నిలబడతారు. ఊరంతా భయపడే బైరాగిని చంపి పలాసకు కొత్త మొనగాడిగా ఎదుగుతాడు మోహన్ రావు. అయితే.. మోహన్ రావు బలాన్ని రౌడీ ఇజంగా మార్చి అతడి బలం-బలగంతో రాజకీయ పావులు కడుపుతాడు ప్రెసిడెంట్ తమ్ముడు (రఘు కుంచె). ఈ రాజకీయ చదరంగంలో మోహన్ రావు తన అనుకున్నవాళ్ళకి ఎలా దూరమయ్యాడు? 1978లో మొదలైన ఈ రక్త చరిత్ర 2019లో ఎలా ముగిసింది? అనేది “పలాస” కథాంశం.
నటీనటుల పనితీరు: “పలాస” పోస్టర్స్ లో బాగా ఆకట్టుకున్న అంశం కథానాయకుడు రక్షిత్ కళ్ళల్లోని రౌద్రం. పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళాలి అనిపించేలా చేసిన ఆ రౌద్రం సినిమాలో ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటే అవార్డులు సైతం అందుకునే స్థాయి, లోతు ఉన్న పాత్ర మోహన్ రావుది. అయితే.. రక్షిత్ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. ఆ కారణంగా ఆ పాత్ర ద్వారా ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. నటుడిగా రక్షిత్ ఇంకా చాలా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. రంగారావు పాత్రలో తిరువీర్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే.. రఘు కుంచె, ప్రెసిడెంట్ పాత్ర పోషించిన నటుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు.
సాంకేతికవర్గం పనితీరు: కరుణకుమార్ దర్శకత్వ ప్రతిభ కంటే రచయితగా ఆయన ముక్కుసూటితనం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎటువంటి సంకుచితత్వం లేని మాటలు, 70ల కాలం నుండి నేటివరకు సమాజంలో పైకి కనిపించని వర్గ విద్వేషాలను ఎలాంటి సెన్సారింగ్ లేకుండా తెరపై చూపించడానికి దమ్ము ఉండాలి, ఆ దమ్ము కాస్త ఎక్కువగానే ఉంది కరుణకుమార్ కి. కొందరికి ఈ విద్వేషాలు, కులం పేరుతో జరిగే అన్యాయాల గురించి సరైన అవగాహన లేనివాళ్లకు ఈ సినిమాలో చూపించిన విషయాలు పెద్దగా అర్ధంకాకపోవచ్చు కానీ.. సంఘంలో, సమాజంలో కులం పేరుతో ఆకృత్యాలను న్యూస్ పేపర్లు, వెబ్ సైట్లలో చదివేవారికి మాత్రం ఈ సినిమా సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.
దర్శకుడు కరుణకుమార్ క్యారెక్టరైజేషన్స్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. అయితే.. ఈ తరహా పాత్రలను, సందర్భాలను ఇప్పటికే చాలా చూసేసాం. ఒక్క శీకాకుళం యాస తప్పితే.. “పలాస” చిత్రంలో కొత్తదనం పెద్దగా కనిపించదు. అయితే.. కరుణకుమార్ రాసిన సంభాషణలు సినిమాకి హైలైట్ మాత్రమే కాదు.. జనాలని కనెక్ట్ చేస్తోంది.
అరుళ్ కెమెరా పనితనం సహజంగా ఉన్నప్పటికీ.. బడ్జెట్ ఇష్యుస్ కారణంగా బాగా కాంప్రమైజ్ అయినట్లు స్పష్టమవుతూనే ఉంది. రఘు కుంచె బాణీలు, నేపధ్య సంగీతం ఆకట్టుకున్నాయి. 1978 పరిస్థితులను, స్థితిగతులను ఆర్ట్ వర్క్ డిపార్ట్ మెంట్ పూర్తిస్థాయిలో రీక్రియేట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్, లైటింగ్, డి.ఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్ పీరియన్స్ క్రియేట్ చేసి ఉండేవారు దర్శకనిర్మాతలు.
విశ్లేషణ: రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా.. కాస్త విభిన్నమైన చిత్రాలు చూడగలిగేవారికి “పలాస” ఈ వారం ఒక మంచి ఆప్షన్. కాకపొతే.. కథనం, క్యారెక్టర్స్ ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే మరింత మంచి విజయం సాధించే అవకాశం ఉండేది. దర్శకుడు కరుణకుమార్ ఎఫర్ట్స్ కోసమైనా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 2/5
Click Here To Read English Review