తెలుగు ఆడియన్స్ సినిమా చూసే విధానంతో పాటు.. మేకర్స్ సినిమాలు తీసే విధానంలో కాలానికనుగుణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిఫరెంట్ జానర్స్, కొత్త కథలు, అద్భుతమైన పాత్రలు సృష్టిస్తూ.. టాలీవుడ్ కీర్తిప్రతిష్టలను పెంచుతున్నారు ప్రతిభావంతులైన దర్శకులు. అలాంటి ఓ వైవిద్య భరితమైన కథాంశంతో వస్తున్న చిత్రం ‘పంచతంత్రం’.. హర్ష పులిపాక దర్శకత్వంలో.. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ల మీద అఖిలేష్ వర్థన్, సృజన్ యరబోలు నిర్మించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలకపాత్రలో కనిపించనున్నారు.
రాహుల్ విజయ్, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, నరష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు టీం.. ఇందులో భాగంగా ‘పంచతంత్రం’ డిజిటల్ ట్రైలర్ రష్మిక మందన్న విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడమేకాకుండా.. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనిపించేలా ఉంది. ఐదు జీవితాలకు సంబంధించిన కథ.. ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాముఖ్యతతో కూడుకున్నదే.
బ్రహ్మానందం కథకుడిగా కనిపిస్తున్నారు. ఐదు జీవితాలకు సంబంధించిన ఈ కథలను పంచేంద్రియాలనే థీమ్‌తో పోలుస్తూ.. ఒక్కొక్క స్టోరీని క్లుప్తంగా చూపించారు. ‘కష్టమొచ్చింది కదా అని దించేసుకోవడానికి ఇది భారం కాదమ్మా.. బాధ్యత.. నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో.. నీతో షేర్ చేసుకునే వారి లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జెస్ట్‌మెంట్స్‌కున్నవాల్యూ తెలుస్తుంది’’ లాంటి మాటలు ఆకట్టుకుంటున్నాయి.
క్యారెక్టర్లు, వాళ్లు ఎదుర్కొనే సమస్యలు, భావోద్వేగాలు, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ హైలెట్ అయ్యాయి ట్రైలర్‌లో.. సీనియర్ యాక్ట్రెస్ దివ్య వాణి, వికాస్ ముప్పాల, ఆదర్శ్ బాలకృష్ణ, ఉత్తేజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటున్న కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి.. ‘పంచతంత్రం’ కథ నచ్చడంతో రీ ఎంట్రీ ఇస్తుంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ ‘పంచతంత్రం’ డిసెంబర్ 9న విడుదలవబోతోంది.