వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలతో వరుస విజయాలు అందుకొంటున్న విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన 25వ చిత్రం “పందెం కోడి 2”. 2005లో వచ్చి ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు విశాల్ కి మాస్ హీరోగా సూపర్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన “పందెం కోడి 2” మీద విశేషమైన అంచనాలున్నాయి. మరి లింగుస్వామి ఆ మాస్ మసాలా మ్యాజిక్ ను రిపీట్ చేయగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!
కథ : పులివెందుల అనే ఊరికి పెద్ద మనిషి అయిన రాజా రెడ్డి (రాజ్ కిరణ్) గత ఏడేళ్లుగా ఊర్లో జరగని భైరవుడి జాతరను ఈ ఏడాది నిర్వహించి తద్వారా ఊరికి మంచి చేయాలని ఆశపడతాడు. అసలు ఏడేళ్లుగా ఊర్లో జాతర జరగడానికి వీల్లేకుండా చేసిన భవానీ (వరు శరత్ కుమార్) ఇదే అదునుగా తాను ఎప్పట్నుంచో పగ పెంచుకున్న మనిషిని చంపాలని ప్రయత్నిస్తుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం బాలు 9విశాల్) ఊర్లో జరుగుతున్నా జాతరతోపాటు తండ్రి మాట ఇచ్చిన మనిషి ప్రాణాలు కాపాడతానని భవానీకి ఎదురు నిలబడతాడు. ఈ క్రమంలో జరిగిన రక్తసిక్త పోరు సమాహారమే “పందెం కోడి 2” కథాంశం.
నటీనటుల పనితీరు : ఈ తరహా పాత్రలు పోషించడంలో దిట్ట అయిన విశాల్ తనదైన శైలిలో బాలు పాత్రలో ఒదిగిపోయాడు. విశాల్ మాస్ లుక్స్ & యాక్షన్ సీక్వెన్స్ లలో మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటాయి.
కీర్తి సురేష్ ఈ చిత్రంలో చిచ్చరపిడుగులా రెచ్చిపోయింది. “మహానటి”లో చూసిన పిల్లేనా అని అందరూ అనుకొనేలా పేట్రేగిపోయింది. అమ్మడి కెరీర్ లో ఒక మంచి పాత్రగా ఈ చిత్రంలో పోషించిన చారుమతి మిగిలిపోతుంది. ఆమె ఎనర్జీ లెవల్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజ్ కిరణ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో పెద్ద మనిషి పాత్రకు వన్నె తీసుకురాగా.. పొగరుబోతు పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ “పొగరు” సినిమాలో శ్రియారెడ్డిని గుర్తుచేసింది. ఆమె పాత్రలో జీవించిన విధానం బాగున్నప్పటికీ.. క్యారెక్టరైజేషన్ సరిగా లేకపోవడం, కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేకపోవడంతో ఆమె పాత్ర ప్రేక్షకుల మీద కానీ కథనం మీద కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు : యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ వరకు పర్లేదు కానీ.. పాటలకు మాత్రం ఎక్కువ కష్టపడకుండా తన పాత్ర ట్యూన్స్ ను వాడేశాడు. కె.ఎ.శక్తివేల్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది, పండగ వాతావరణాన్ని తెరపై అద్భుతంగా ప్రెజంట్ చేసింది కూడా. అనల్ అరసు యాక్షన్ సీన్స్, ఎడిటింగ్ వంటివన్నీ బాగున్నాయి.
అసలు సమస్య వచ్చిందల్లా మన డైరెక్టర్ లింగుస్వామి రాసుకొన్న కథ-కథనం వల్లే. పార్ట్ 2 అనేసరికి సీక్వెల్ లా ఉండాలని పడిన తాపత్రయం బెడిసికొట్టింది. ఇక కథనం అయితే నీరసం తెప్పిస్తుంది. విశాల్ & గ్యాంగ్ ను మట్టుబెట్టడానికి భవానీ & టీం వేసే వందలాది ప్లాన్స్ తోనే సినిమా చివరివరకు సాగుతుంది. ఇదంతా సరిపోదన్నట్లు.. సినిమా మొత్తం జాతర వాతావరణంలోనే చిత్రీకరించడంతో ఈ సినిమాకి “పందెం కోడి 2” అని కాకుండా “బ్రహ్మోత్సవం 2” అని టైటిల్ పెట్టి “ఇది ఫ్యాక్షన్ సినిమా” అని ట్యాగ్ లైన్ పెడితే బాగుండేమో అనిపిస్తుంది. పాపం ఈ సినిమాతో విశాల్ హీరోగా మాత్రమే కాక నిర్మాతగానూ బొక్కబోర్లా పడ్డాడు.
విశ్లేషణ : “పందెం కోడి 2” అనగానే మాస్ మసాలా సినిమా అనుకోని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల మేడకి సెంటిమెంట్ అనే కత్తి పెట్టాడు దర్శకుడు లింగుస్వామి. సో, 149 నిమిషాలపాటు ఈ చిత్రాన్ని ఓపిగ్గా థియేటర్లో కూర్చుని చూడడం కాస్త కష్టమే.