ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ (Pawan Kalyan) వల్ల ఇండస్ట్రీకి మేలు జరిగేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో కూటమి విజయం గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, పవన్ తో అనుబంధం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారని ఈసారి ఏపీ ఎన్నికల్లో అదే జరిగిందని పరుచూరి పేర్కొన్నారు.
ప్రజలు కోరుకున్న విధంగా రాజకీయ నాయకులు లేకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని ఆయన అన్నారు. చంద్రబాబుతో నాకు మంచి అనుబంధం ఉందని ఆయన ప్రభుత్వంలో గతంలో నేను పని చేశానని పరుచూరి తెలిపారు. పోరాట శక్తికి వయస్సుతో సంబంధం లేదని చంద్రబాబు ప్రూవ్ చేశారని ఆయన అన్నారు. అరెస్ట్ చేసినా చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రజలను మెప్పించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారని పరుచూరి పేర్కొన్నారు.
పవన్ ను నేను ఒక్కసారే కలిశానని పవన్ కళ్లు చూస్తే నేను సాధిస్తున్నా అనే విశ్వాసం కనిపించేదని ఆయన తెలిపారు. పవన్ ను చూసిన సమయంలో ఫ్యాన్స్ అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయేమో అని అనిపించేదని అలాంటి గొప్ప అభిమానులు పవన్ సొంతమని పరుచూరి పేర్కొన్నారు.
ఎన్నికల్లో విజయం తర్వాత కూడా పవన్ వినయంతో ఉన్నారని ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నెరవేర్చాలనే ఆలోచనతో మాట్లాడారే తప్ప ఎవరినీ నిందించలేదని అలా మాట్లాడటం పవన్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఆయన వెల్లడించారు. పరుచూరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పరుచూరి కామెంట్ల విషయంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.