2025 ఏడాది చివర్లో క్లియరెన్స్ సేల్ లా డిసెంబర్ 25న ఏకంగా 8 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నిటిలో చిన్న సినిమా “పతంగ్”. ట్రైలర్ & సాంగ్స్ బాగున్నప్పటికీ.. అందరూ కొత్తవాళ్లు కావడం, ప్రమోషన్స్ కాస్త తక్కువ ఉండడంతో ఈ సినిమా త్వరగా రిజిస్టర్ అవ్వలేదు. మరి చిన్న సినిమాగా విడుదలైన “పతంగ్” పెద్ద విజయం సాధించిందా? కొత్తవాళ్లందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించింది? అనేది చూద్దాం..!!

కథ: విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. 12 ఏళ్ల వీళ్ల స్నేహబంధానికి బీటలు బారేలా చేస్తుంది ఐశ్వర్య (ప్రీతి పగడాల). ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి శుభం కార్డ్ పడడం కోసం పతంగుల పోటీ పెట్టుకుంటారు మన హీరోలు.
ఎవరు గెలిచారు? ఎవరు ఐశ్వర్య మనసు గెలుచుకున్నారు? అనేది “పతంగ్” కథాంశం.
చాలా సింపుల్ గా ఉన్నా.. క్యారెక్టరైజేషన్స్ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కానీ వాటిని థియేటర్లో ఎంజాయ్ చేయాలి.

నటీనటుల పనితీరు: ఏదో ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేసుకునే అమ్మాయి, సినిమాలో ఏం చేస్తుందిలే అనుకునే ప్రతి ఒక్కరికీ తన పెర్ఫార్మెన్స్ తో సమాధానం చెప్పింది ప్రీతి పగడాల. కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ను, లవ్ లో ఉండే కన్ఫ్యూజన్స్ ను భలే ప్రెజెంట్ చేసింది. కళ్లతో పండించాల్సిన హావభావాల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలి.
వంశీ పూజిత్ లో మంచి ఈజ్ ఉంది. ఒకప్పటి ధనుష్ లో ఉండే ఈజ్ మరియు నానిలో ఉండే టైమింగ్ మిక్స్ చేసినట్లుగా ఉన్నాడు. ఎమోషనల్ సీన్స్ & ఇన్నోసెన్స్ ను బాగా పండించాడు.
ప్రణవ్ కౌశిక్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. డ్యాన్సులు బాగా చేశాడు. చాలా రిలేటబుల్ క్యారెక్టర్. వంశీ పూజిత్-ప్రణవ్ కౌశిక్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
ఎస్.పి.చరణ్, వడ్లమాని శ్రీనివాస్ లకు మంచి పాత్రలు పడ్డాయి. విషిక క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. మంచి మాస్ పాత్ర కావడంతో ఆమె మ్యానరిజమ్స్ & కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ప్రణవ్ చెల్లెలిగా నటించిన విజ్ఞాని భలే క్యూట్ గా ఉంది. “మిరపకాయ్” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ను గుర్తుచేసింది.
ఫ్రెండ్స్ క్యారెక్టర్ అందరూ భలే ఆకట్టుకున్నారు. వాళ్ల పాత్రల ద్వారా క్లైమాక్స్ లో పండించే కామెడీ సీన్స్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ గెస్ట్ రోల్ కథనానికి బాగా ఉపయోగపడింది. ఆయన మీద వేసిన పంచులు బాగా పేలాయి.

సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మీ, సినిమాటోగ్రాఫర్ శక్తి అరవింద్ ఈ సినిమాకి మెయిన్ హీరోలు అని చెప్పొచ్చు. జోస్ జిమ్మీ సంగీతంలో చాలా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. వైడ్ వెరైటీ సాంగ్స్ ఉన్నాయి. పాటల సాహిత్యం కూడా బాగుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ & బిట్ సాంగ్స్ అయితే భలే ఎంగేజింగ్ గా ఉన్నాయి.
శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ స్టైల్ బాగుంది. ఆల్మోస్ట్ రియలిస్టిక్ లొకేషన్స్ లో షూట్ చేయడం, కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ అనేది ఆడియన్స్ కి ఒక సాటిస్ఫైంగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి సింపుల్ కథను తీసుకుని, ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా కథలో పతంగ్ ను కీలకాంశంగా మార్చిన విధానం బాగుంది. అలాగే.. ప్రస్తుత తరం యువతకి ఉండే కన్ఫ్యూజన్లను ఆసక్తికరంగా, అందంగా చిత్రించిన విధానం, హాస్యాన్ని ఎక్కడా గీత దాటకుండా రాసుకున్న తీరు బాగున్నాయి. అలాగే.. సినిమాని ముగించిన విధానం కూడా బాగుంది. ఓవరాల్ గా.. “పతంగ్”తో దర్శకుడిగా, రచయితగా ప్రణీత్ ప్రత్తిపాటి మంచి విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి.

విశ్లేషణ: తెలుగు సినిమాకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొత్త కాదు. అయితే.. కొత్తదనం కంటే ఆసక్తికరం అనేది ఎప్పుడూ అలరిస్తుంది. “పతంగ్” టీమ్ చేసింది అదే. ఆల్రెడీ ఎన్నోసార్లు చూసిన కథను కొత్తగా హైద్రాబాదీ స్టైల్లో, మంచి మ్యూజిక్ తో తెరకెక్కించాడు దర్శకుడు ప్రణీత్. మంచి నటీనటులు, వాళ్లకి మించిన టెక్నీషియన్లు కుదరడంతో.. “పతంగ్” ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చూసామే అనే భావన కలిగిస్తుంది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది.

ఫోకస్ పాయింట్: ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ఫ్రెష్ సినిమా గురూ!
రేటింగ్: 3.5/5
