రాజకీయ నేపథ్యంలో సినిమా వస్తే… చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు కానీ… దానిని జీర్ణించుకోవడానికి రాజకీయ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉంటారా అంటే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా చూస్తే… సినిమాల్లో రాజకీయం అంత మంచి అనుభవం అయితే ఇవ్వదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న పవన్ కల్యాణ్, ధనుష్ సినిమాల నేపథ్యం చూస్తే… రాజకీయ వేడి రగిలేలా ఉంది. అదేంటి… వపన్, ధనుష్ చేయబోతున్న సినిమాల కథ విద్యా వ్యవస్థ మీద అంటున్నారు కదా?
రాజకీయం ఎక్కడ నుండి వచ్చింది అనే డౌట్ రావొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశంలో విద్యావ్యవస్థ – రాజకీయం ఎప్పుడూ కలిసే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. దేశంలో కీలక విద్యాలయాల్లో ఎక్కువ శాతం రాజకీయ నాయకుల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి. లేదంటే విద్యాలయాల అధిపతులు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఈ నేపథ్యంలో మన సినిమా హీరోలు విద్యా వ్యవస్థ గురించి, అందులో లోపాల గురించి, విధి విధానాల గురించి సినిమాల్లో చర్చిస్తే కచ్చితంగా సమస్య వస్తుంది.
అందులోనూ పవన్ ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి సినిమా ఆయనకు ఉపయోగపడొచ్చు. అయితే ధనుష్ దగ్గరకు వచ్చేసరికి కచ్చితంగా తేనె తుట్టెను కదిలించడమే అవుతుంది.