“అజ్ఞాతవాసి” అనంతరం పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో తన జీవితం ఇక ప్రజలకు మాత్రమే అంకితమని, ఇకపై సినిమాలు చేసే ప్రసక్తి లేదని గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఆయన అభిమానులను ఒకరకంగా బాధపెట్టినా.. పర్వాలేదులే అనుకున్నారు. కట్ చేస్తే.. “వకీల్ సాబ్”తో రీఎంట్రీ కన్ఫర్మ్ చేసాడు కళ్యాణ్. ఆ తర్వాత వరుసబెట్టి ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ చేసాడు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ చంద్ర. ఇలా యువ దర్శకులతో వరుసబెట్టి పుట్టినరోజున ఫుల్ ట్రీట్ ఇచ్చాడు ఫ్యాన్స్ కి.
పవన్ మళ్ళీ సినిమాలు ఎనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అదే అదునుగా పవన్ ను వెటకారం చేయడం మొదలెట్టారు కొందరు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఆయన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరీ ముఖ్యంగా ఆయన పార్టీ వ్యక్తులే ఆయన సినిమాలు చేయడం పట్ల విముఖత వ్యక్తం చేసి పార్టీ నుంచి వైదొలగారు. అయితే.. నిన్నమొన్నటివరకు ఈ విషయంలో స్పందించని పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో కాస్త గట్టిగానే బదులిచ్చాడు.
“పేకాట క్లబ్ లు నడుపుకునే రాజకీయ నాయకులు, బిజినెస్ లు చేసుకొనే ముఖ్యమంత్రులు రాజకీయాల్లో ఉండగా లేనిది.. నేను సినిమాలు చేస్తూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం తప్పా” అని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోలు భీభత్సంగా వైరల్ అవుతున్నాయి.