కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’కు హాజరై, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వారి ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న సాయంత్రం జరిగిన సభకు వేలాదిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. పవన్ వేదికపై మాట్లాడే సమయంలో అతన్ని చూసేందుకు కొంతమంది పక్కనే ఉన్న బిల్డింగ్ ని ఎక్కారు. వెంకట నారాయణ అనే పెయింటర్ పైప్ ని పట్టుకుని పవన్ ప్రసంగాన్ని చూస్తుండగా ఆ పైప్ పగలడంతో కిందపడ్డాడు.
దీంతో అతని తలకి బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయం తెలిసి తాను రాత్రంతా నిద్ర పోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. “ఇటువంటి సంఘటనలు జరుగుతాయనే నేను సామాన్యంగా జనాల్లోకి రాను. నిన్న సభ జరిగినా అందులో ఎటువంటి ఉద్వేగ పూరిత ప్రసంగం చేయకుండా చాలా కంట్రోల్ చేసుకున్నా. అయినా ప్రమాదంలో కార్యకర్తను కోల్పాయాం. ఆ పిల్లాడి తల్లిదండ్రులకు నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటా” అని పవన్ శనివారం చెప్పారు. ఆ కుటుంబాని 5 లక్షల ఆర్ధిక సాయాన్ని జనసేన పార్టీ ప్రకటించింది.