సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు నిర్వహించనున్న’సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం మూడంచెల కార్యాచరణ ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగా ఈ సభను కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సభకు పవన్ అభిమానులతో పాటు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మద్దతు తెలిపారు.
” పవన్ నేడు కాకినాడలో ప్రత్యేక హోదా పై జరుపుతున్న ద్వితీయ సభ అద్వితీయంగా జరగాలని ప్రజలను కార్యోన్ముఖుల్ని చెయ్యాలని అభిలషిస్తున్నాను” అని అయన శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పరుచూరితో పాటు అనేక మంది పవన్ కు అండగా నిలవనున్నట్లు తెలిసింది. ప్రత్యేక హోదా పై చట్టసభల్లో చర్చ జరుగుతున్న ఈ సమయంలో పవన్ ఆ అంశంపై ఎలా మాట్లాడుతారో అని ఆంధ్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రసంగం చాలా కీలకంగా మారనుంది. సభ అనంతరం జనసేన పార్టీ అధినేత తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండనున్నారు. ఆయన శనివారం అచ్చంపేటలోని కిరణ్ కంటి ఆస్పత్రిని సందర్శిం చనున్నట్లు సమాచారం.