Payal Rajput: పాయల్‌ ‘బ్యాన్‌’ కామెంట్స్‌… రియాక్ట్‌ అయిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌!

తెలుగు సినీ పరిశ్రమ నుండి తనను ‘బ్యాన్‌’ చేయాలని చూస్తున్నారు అంటూ కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput)  సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడాన్ని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నవాళ్లకు అసలు సంగతి ఏంటో తెలిసే ఉంటుంది. లేదేంటో ఓసారి ఈ మొత్తం విషయాన్ని రివైండ్‌ చేసి చూద్దాం. ప్రదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా ‘రక్షణ’ అనే సినిమాను తెరకెక్కించారు.

ఎప్పడో నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా వాయిదాలు పడుతూ పడుతూ ఎట్టకేలకు ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు పాయల్‌ రాజ్‌పుత్‌ నిరాకరించింది. ‘నాలుగేళ్ల కిందటి సినిమా. ఇప్పుడు ప్రమోషన్స్‌కి రాలేను. కావాలంటే ఓటీటీలో విడుదల చేసుకోండి’ అని సలహా ఇచ్చిందట. సినిమా ప్రారంభానికి ముంఉద కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా కోసం 50 రోజులు డేట్స్‌ ఇవ్వడంతో పాటు, ప్రమోషన్స్‌లో పాయల్‌ పాల్గొనాల్సి ఉందట.

అయితే 47 రోజులే షూటింగ్‌లో పాల్గొందట పాయల్‌. ఆ విషయం పక్కనపెడితే.. కొవిడ్‌ – లాక్‌డౌన్‌, ఆర్థిక సమస్యల కారణంగా సినిమా అనుకున్న సమయానికి పూర్తవ్వలేదు, విడుదల చేయలేకపోయాం అని టీమ్‌ అంటోంది. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి, ప్రచారానికి పిలిస్తే పాయల్‌ నుండి సరైన స్పందన లేదని సినిమా టీమ్‌ వాపోయింది. ఆమెకు ఇవ్వాల్సిన మిగిలిన పారితోషికం రూ.6 లక్షలు ఇస్తామని చెప్పినా.. దానికి సంబంధించిన చెక్‌ను ఇచ్చినా ప్రచారానికి పాయల్‌ ముందుకురాలేదు అని టీమ్‌ చెబుతోంది.

దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. కానీ పాయల్‌ ‘మా’లో సభ్యురాలు కాకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారట. దీంతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తే పాయల్‌ మేనేజర్‌ను పిలిచి సమస్యను పరిష్కరించాలని సూచించారట. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కు వస్తానని పాయల్‌ మొదట చెప్పి, ఆ తర్వాత మాట మార్చిందట.

అక్కడితో ఆమె ఆగకుండా ‘నన్ను బ్యాన్‌ చేస్తారట’ అనే పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పెట్టింది. దీన్ని తెలుగు చలన నిర్మాతల మండలి ఖండించింది. మరి ఇప్పుడు పాయల్‌ ఏమంటుంది, ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక్కడో విషయం ఏంటంటే సరైన కెరీర్‌ లేని తనకు . నాలుగేళ్ల క్రితం సినిమా వచ్చి ఇబ్బందిపెడుతుందేమో అని పాయల్‌ అనుకుంటోందని సన్నిహితులు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus