లీక్‌లు ఎప్పుడైనా సినిమాకు చేటు చేస్తాయి.. కానీ కొన్ని లీక్‌లు సినిమా మీద హైప్‌ను అమాంతం పెంచుతాయి. అలాంటి లీక్‌లే ‘చిరు లీక్స్’. అవును మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్ అలా ఉంటాయి మరి. సినిమా గురించి ఆయన ఏదైనా విషయం చెప్పారు అంటే.. అందులో ఆయనకు బాగా నచ్చింది, సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది అనిపించే అంశాన్ని చెప్పేస్తుంటారు ఆయన. ఇప్పుడు అలా ‘పెద్ది’ సినిమా గురించి కూడా ఓ విషయం చెప్పేశారు. ఇప్పుడు ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు ఫైనల్ కట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి ట్రైలర్‌ను చూపించారు. ఆ తర్వాత ఆయన రియాక్ట్ అవుతూ ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ‘పెద్ది’ సినిమా ట్రైలర్ ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే ఒక డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్ చూశా. వావ్! మూడు నిమిషాలు.. ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని తనదైన శైలిలో హైప్ ఇచ్చారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు, రెహమాన్.. ఒక్కొక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. కలసి రఫ్ఫాడించేశారు అంటే అంటూ సినిమా ట్రైలర్ ఎంతగా నచ్చిందో చెప్పేశారు. ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్, అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి అని ట్రైలర్ గురించి ఎర్లీ రివ్యూ ఇచ్చారు.
అక్కడితో ఆగకుందా చాలా రోజులైంది మీకు ‘చిరు లీక్స్’ ఇచ్చి.. ‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు’ అంటూ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్ లీక్ చేశారు. ఆ మాట చెప్పేశాక ‘సారీ బుచ్చి బాబు ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా’ అని అన్నారు చిరు. సినిమాను జూన్ 4న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.