అందమైన ఓ జంట, విహార యాత్ర పిల్లవాడైన కొడుకు కనిపించకుండా పోవడంతో విషాదంగా మారుతుంది. దట్టమైన ఆ అడవిలో తల్లి వెతుకులాట మరియు అందరూ కొడుకు ఇక రాడంటున్నా ఎక్కడో ఉన్నాడు, వస్తాడు అనే తల్లి ఆశ, ఆవేదనల సమాహారమే పెంగ్విన్ మూవీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మహానటి చిత్రం తరువాత టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ మరో సారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పెంగ్విన్ చిత్రంలో చేశారు అనిపిస్తుంది.
నటిగా ఆమె స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమాగా పెంగ్విన్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కన్న కొడుకు కోసం ప్రమాదాలకు ఎదురు వెళ్లే మహిళగా ఆమె రోల్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఇక ఈ చిత్రంలో క్రైమ్ యాంగిల్ కూడా ఉంది. వరుసగా పిల్లలను కిడ్నాప్ చేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురించేసే సైకో కిల్లర్ చుట్టూ ఈ కథ తిరిగే ఆస్కారం ఉంది. భయంకరమైన అడవిలో కిల్లర్ చర్యలు జుగుప్స కలిగించేవిగా ఉన్నాయి.
మరి చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి హింసించడం వెనుక ఆ కిల్లర్ మోటివ్ ఏంటి అనేది మూవీ చూస్తే కానీ తెలియదు. మొత్తంగా, ఎమోషన్స్ ,క్రైమ్ , హారర్ అండ్ సస్పెన్సు కలగలిపి అధ్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రం 19న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కానుంది.