ఇటీవల ప్రకటించిన, బహూకరించిన జాతీయ చలన చిత్ర పురస్కరాల ఆనందం ఎక్కడైనా ఎక్కువగా ఉందీ అని అడిగితే… తొలుత టాలీవుడ్ పేరు చెపితే, రెండో పేరు మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమాల వరకు ఎక్కువ పురస్కారాలు ఆ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమాలకే వచ్చాయి. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్… ఇటీవల గ్రాండ్ పార్టీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దిల్లీలో ఇటీవల పురస్కరాల ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సందడి చేశారు. అల్లు అర్జున్ కేక్ కట్ చేయగా, దేవిశ్రీ ప్రసాద్ లైవ్ సాంగ్స్‌తో అలరించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు కొరటాల శివ, గోపీచంద్ మలినేని, మారుతి, హరీశ్ శంకర్, బాబీ… నటులు ప్రకాశ్‌రాజ్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
కేవలం తమ నిర్మాణ సంస్థల సినిమాల్లో చేసి అవార్డులు వచ్చినవాళ్లే కాకుండా, గతంలో తమ సంస్థలో పని చేసిన వారిని కూడా మైత్రీ టీమ్ పిలిచింది. అలాగే ‘నాటు నాటు..’ పాటకు పురస్కారం అందుకున్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా ఈ పార్టీకి హాజరైన వారిలో ఉన్నారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ చిత్రానికి గానూ (Allu Arjun) అల్లు అర్జున్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే.
అలాగే ఉత్తమ యాక్షన్ డైరెక్టర్‌గా కింగ్ సాలమన్ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాస మోహన్ (ఆర్‌ఆర్ఆర్) అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ చిత్రం (తెలుగు)గా ‘ఉప్పెన’ పురస్కారం దక్కించుకున్న విషయం తెలిసిందే.