కొన్ని సినిమాలు నవ్వించి విజయం సంపాదిస్తే, ఇంకొన్ని ఏడిపించి హిట్ కొడతాయి. అయితే ఇంకొన్ని భయపెట్టి గెలుస్తాయి. ప్రేక్షకుల్లో ఉండే హారర్ ఇంట్రెస్ట్‌ను ఉపయోగించుకుని సినిమాలు చేసే దర్శకులు కచ్చితంగా విజయాలు అందుకుంటున్నారు. ఈ విషయం ఈ ఏడాది టాలీవుడ్‌లో చాలాసార్లు నిజమని తేలింది. అందులో ఓ సినిమా ‘పిండం’. శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.
ఇందాక చెప్పినట్లు ఈ ఏడాది వివిధ హారర్ జోనర్ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనే ట్యాగ్‌తో వచ్చిన ‘పిండం’ కూడా అలాగే విజయం అందుకుంది. మూవీలోని ట్విస్టులకు థియేటర్లలో ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని చూశారని టాక్. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీ డేట్ దాదాపు ఫిక్స్ అయిపోయిందట. నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.
‘పిండం’ సినిమా కథ విషయానికి వస్తే… ఆంథోనీ (శ్రీరామ్) ఓ రైసు మిల్లులో అకౌంటెంట్. అతడి భార్య మేరీ (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు (సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలసి ఓ పురాతనమైన ఇంట్లో ఉంటారు. తక్కువ ధరకు వస్తుందని ఆ ఇల్లు కొంటారు. అయితే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఊహించని సంఘటనలు వాళ్లకు ఎదురవుతాయి. వాటిని ఆ కుటుంబం ఎలా ఎదుర్కొంది అనేది సినిమా కథ.
మనిషికి మరణం అనేది అంతమా?
ఇక ‘పిండం’ (Pindam) మూవీలో 2023లో పాటు 1990, 1930 కాలాల్లో జరిగిన కథను ఇందులో చూపించారు. మరణం అనేది నిజంగానే అంతమా? అనే విషయంపైనా ఈ సినిమాలో చర్చించారు. ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా? ఒకవేళ అలా నిలిచిపోతే, ఆ ఆత్మలు మనకు నిజంగానే హాని చేస్తాయా? అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.