తమిళ, తెలుగు భాషల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా “పిజ్జా”. హీరోగా విజయ్ సేతుపతికి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజుకి బలమైన పునాది ఈ చిత్రం. ఆ ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన మూడో చిత్రం “పిజ్జా 3: ది మమ్మీ”. అశ్విన్ కకుమాను కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో గత నెల విడుదలయ్యి యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువాదరూపంలో విడుదల చేశారు. మరి ఈ హారర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: ఒక ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ నలన్ (అశ్విన్ కకుమాను). కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ బిజినెస్ లో మంచి పాపులారిటీ సంపాదించుకొని, తాను ప్రేమించిన కయల్ (పవిత్ర)తో రొమాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తుంటాడు. కట్ చేస్తే.. ప్రతిరోజూ రెస్టారెంట్ కిచెన్ లో ఒక కొత్త వంటకం ప్రత్యక్షమవుతుంటుంది. అది ఎవరు తయారు చేస్తున్నారో తెలియక, తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూ నానా ఇబ్బందులుపడుతుంటాడు నలన్. సరిగ్గా అదే తరుణంలో రెస్టారెంట్ లో జరిగిన ఒక మర్డర్ మనోడి మెడకు చుట్టుకుంటుంది.
ఇదంతా ఒక ఈజిప్షియన్ బొమ్మ వల్ల జరుగుతుంది అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు. అదే సమయంలో కయల్ తయారు చేసిన ఒక యాప్ ద్వారా దెయ్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు నలన్. ఈ క్రమంలో నలన్ తెలుసుకున్న నిజాలేమిటి? అసలు దెయ్యానికి, అతడి రెస్టారెంట్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఆ దెయ్యం గతం ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “పిజ్జా 3: ది మమ్మీ” చిత్రం.
నటీనటుల పనితీరు: అశ్విన్ కకుమాను నటుడిగా ఇప్పటికే తన సత్తాను పలు చిత్రాల్లో చాటుకున్నాడు. అలాగే ఈ తరహా హారర్ సినిమాల్లోనూ ఇదివరకే అలరించిన అశ్విన్ ఈ సినిమాలోనూ భయపడుతూ బాగానే ఆకట్టుకున్నాడు. అతడి పాత్రకు చెప్పించిన డబ్బింగ్ వాయిస్ కూడా బాగా సింక్ అయ్యింది. హీరోయిన్ పవిత్ర గ్లామరస్ గా ఉన్నా.. నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. హావభావాలతో కథను ముందుకు తీసుకెళ్ళాల్సిన చాలా సన్నివేశాల్లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇస్తుందో తెలియనేలేదు. కాళీ వెంకట్, గౌరవ్, అనుపమ కుమార్ పర్వాలేదు అనిపించుకున్నా.. సీనియర్ యాక్టర్ కవితా భారతి మాత్రం తన నటనతో అద్భుతంగా అలరించాడు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ప్రభురామన్ పనితనాన్ని మెచ్చుకోవాలి. కేవలం జంప్ స్కేర్ షాట్స్ తో మాత్రమే కానిచ్చేయకుండా.. టెక్నికల్ గా లైటింగ్ & ఫ్రేమ్ వర్క్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అరుణ్ రాజ్ సౌండ్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. హారర్ సినిమాలకు ఉండాల్సిన స్థాయి సౌండ్ డిజైన్ ఈ సినిమాలో లోపించింది. కాకపోతే.. ఎమోషనల్ సీన్స్ కి మాత్రం మంచి నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు.
ఆర్ట్ వర్క్ & వి.ఎఫ్.ఎక్స్ బాగున్నాయి. టెక్నికల్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నా.. కథ-కథనం పరంగా “పిజ్జా 3” చాలా బోరింగ్ సినిమా. ఇదివరకే ఈ తరహా దెయ్యాలు పగ తీర్చుకొనే సినిమాలు చాలా వచ్చేశాయి. లారెన్స్ మాత్రమే చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా డైరెక్టర్ మోహన్ గౌడ్ మాత్రం కథను కొత్తగా చెప్పలేక, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించలేక బొక్కబోర్లాపడ్డాడు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు తెగ బోర్ ఫీల్ అవుతారు.
విశ్లేషణ: ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ హారర్ రివెంజ్ డ్రామా “పిజ్జా 3: ది మమ్మీ”. తమిళంలోనే సరిగా ఆడలేకపోయిన ఈ చిత్రాన్ని ఏ నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేశారు అనేది తెలియలేదు. డబ్బింగ్ క్వాలిటీ మాత్రం బాగుంది.