ఫలానా వ్యక్తి గతంలో బ్రహ్మాండంగా రాసేవారు, తీసేవారు.. ఇప్పుడు ఏమైందో పాపం” అంటూ ప్రేక్షకులు జాలిపడ్డారంటే, గతంలో అతన్ని, అతని సృజనాత్మకతను హద్దులే లేకుండా ప్రేమించారని అర్ధం. మరి గతంలో ఆ ఫలానా మనిషి చేసిన అద్భుతమైన పని, ఇప్పుడు ఎందుకు చెయ్యడం లేదంటే సదరు దర్శకులు అప్డేట్ అవ్వలేదని అర్ధం. ‘అబ్భా..మీరేం చేసినా అద్భుతమే సర్’.. అనే మాటలు వినీవినీ, నిజమనుకుని కావచ్చు, లేదా కేవలం అద్భుతమైన చిత్రాలే రాయాలి, తీయాలి అనే ఉద్దేశ్యంతో కావచ్చు, ఆ తర్వాత ఆ ఫలానా వ్యక్తి పప్పులో, బురదలో కాలేశారు. ‘ఇప్పుడు నేనొక అద్భుతమైనది రాస్తాను’.. లేదా ‘నేను ఏం చేస్తే అది అద్భుతమైన షాటు, మాట’ అనే మితిమీరిన ఆత్మవిశ్వాసం కావచ్చు, ఆ తర్వాత జరిగేవన్నీ పల్టీలు కొడుతుంటాయి. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు.
మీకు గుర్తున్న “మణిరత్నం” లాస్ట్ కమర్షియల్ హిట్ ఏంటి?
“రెహమాన్” లాస్ట్ పాపులర్ ఆల్బమ్ కానీ, పాట కానీ ఏంటి?
“రాంగోపాల్ వర్మ” లాస్ట్ హిట్ సినిమా ఏంటి?
“కృష్ణవంశీ” సినిమాల్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన లాస్ట్ క్రియేటివ్ ఫిల్మ్ ఏంటి?
“ఇళయరాజా” చేసిన లాస్ట్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏంటి?
ఇలా అడుగుతూ పోతే, మనందరం సమాధానాల కోసం గతంలోకి వెళ్లాల్సి వస్తుంది.. చాలా బాధాకరం..కానీ ఇది ప్రతి జనరేషన్ కీ జరుగుతున్న వాస్తవం. చచ్చినట్టు ఒప్పుకుని తీరాల్సిన నిజం. ఇది ఒక కాలచక్రం. ఇక్కడ విషయం వాళ్ళల్లో ‘సరుకు’ అయిపోవడం మాత్రం ఖచ్చితంగా కాదు.. వాళ్ళు మారుతున్న కాలానికి తగ్గట్టు మారకపోవడమో, సెలెబ్రెటీస్ స్టేటస్ లో ఉండిపోయి బయటి ప్రపంచాన్ని ఎక్కువగా చూడలేకపోవడమో, లేదా ఒక్కసారి ప్రాపంచిక విజ్ఞానం, మెచ్యూరిటీ పెరిగిపోయి ‘ప్రేక్షకులకు’ అందకుండా ముందుకెళ్లిపోవడం కూడా కారణాలవ్వొచ్చు.