‘కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ చిన్న చూపు చూడరు’ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి శుక్రవారం ఇది ప్రూవ్ అవుతూనే ఉంది. ఈరోజు అంటే ఏప్రిల్ 18న… చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డియర్ ఉమ’ (Dear Uma). పృథ్వీ అంబార్ (Pruthvi Ambaar), సుమయ రెడ్డి (Sumaya Reddy) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ మహాదేవ్ (Sai Rajesh Mahadev) దర్శకుడు. ‘సుమ చిత్ర ఆర్ట్స్’ బ్యానర్ పై సుమయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం, అలాగే రథన్ (Radhan) ఈ చిత్రానికి సంగీతం కూడా అందించడం అనేది చెప్పుకోదగ్గ విషయం.
అలాగే పాటలు కూడా బాగున్నాయి. ‘వైద్యమా’ అనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. డాక్టర్ అయిన హీరోయిన్, సింగర్ గా ఎదగాలి అనే లక్ష్యంతో ఉండే హీరో..ల ప్రయాణం ఎలా మొదలైంది? హీరోని ఎందుకు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లగొట్టారు.
తర్వాత అతనికి ఎదురైనా ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదంలో అతని గుండెకు ఏమైంది? అతనికి హీరోయిన్ గుండె ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వంటి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సినిమా సాగిందట. ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లకి పేషెంట్లకి మధ్యలో ఉండే వాళ్ళ వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనే సామాజిక అంశాన్ని కూడా అందంగా చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే మార్నింగ్ షోల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.