‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ ఫీవర్ మొదలైంది. ఒకవైపు ‘అగ్నిపరీక్ష’ తో కామన్ మెన్ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే, మరోవైపు సెలబ్రిటీల ఫైనల్ లిస్ట్‌ను నిర్వాహకులు సిద్ధం చేశారు. గత సీజన్ రిజల్ట్ తో మంచి పాఠాలు నేర్చుకుని, ఈసారి జనాలకు బాగా తెలిసిన, పాపులర్ ముఖాలతోనే హౌస్‌ను నింపే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ లిస్ట్‌లో ప్రభాస్ హీరోయిన్ నుంచి మెగా ఫ్యామిలీకి ఆప్తుడి వరకు చాలా ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి.
ఈసారి గ్లామర్ డోస్ పెంచడానికి ఇద్దరు పాత హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. ‘బుజ్జిగాడు’లో ప్రభాస్ సరసన నటించిన సంజనా గల్రాని, ‘నరసింహ నాయుడు’ ఫేమ్ ‘లక్స్ పాప’ ఆశా షైనీ హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు, ‘జయం’ ఫేమ్ కమెడియన్ సుమన్ శెట్టి కూడా తన కామెడీతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.
అలాగే స్మాల్ స్క్రీన్ నుండి ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్, సోషల్ మీడియా నుండి ‘రాను బొంబాయికి రాను’ పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసిన సింగర్ రాము రాథోడ్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళ లిస్ట్‌లో ఉన్నారు. సీరియల్ నటుడిగా, మెగా ఫ్యామిలీకి ఆప్తుడిగా పేరున్న భరణి కుమార్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అన్నట్టు టాక్ వినిపిస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ తో పాపులర్ అయిన పాప కూడా హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. అలాగే వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే కంటెస్టెంట్లు లేకపోతే షోకు మజా ఏముంటుంది చెప్పండి? అందుకే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు పెట్టి సంచలనం సృష్టించిన శ్రేష్ఠ వర్మను కూడా హౌస్‌లోకి తీసుకువస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలు, కామన్ పర్సన్స్ మధ్య జరగబోయే ఈ పోరు రసవత్తరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.