బ్యాంకాక్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన గౌరవం అందుకున్నారు. “మేడం టుస్సాడ్” బ్యాంకాక్ మ్యూజియంలో కలకాలం నిలిచి పోయే అర్హత పొందారు. ఈ సంస్థ వివిధ రంగాల్లో ప్రముఖులకు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంది. వివిధ దేశాల్లో ఎక్కువ ఆదరణ పొందిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. ఈ  మ్యూజియంలో మనదేశానికి చెందిన గాంధీజీ, నరేంద్ర మోడీ, సచిన్, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల విగ్రహాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ఈ అర్హత సాధించిన తొలి హీరో గా డార్లింగ్ రికార్డ్ సృష్టించారు.

బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్రలో మైనపు బొమ్మను మేడం టుస్సాడ్ ప్రతినిధులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వారు హైదరాబాద్ కి వచ్చి అమరేంద్ర బాహుబలి 250 ఫోటోలను, ప్రభాస్ శరీరపు కొలతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ప్రేమించే అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానానికి నేను దాసుడను. బాహుబలి వంటి గొప్ప ప్రాజెక్ట్ లో నన్ను తీసుకున్న గురు రాజమౌళి కి కృతజ్ఞతలు” అని చెప్పారు. ఈ ఆనందాన్ని రాజమౌళి కూడా తన ట్విట్టర్ వేదికపై అభిమానులతో పంచుకున్నారు. “మేడం టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్  విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఈ విగ్రహం 2017 మార్చిలో ఆవిష్కరిస్తారు” అని ట్వీట్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus