ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే.. అతను చాలా వెనకబడి ఉండేవాడు. ‘ఛత్రపతి’ తరువాత అతను వరుస ప్లాప్ లను ఎదుర్కొని.. ‘డార్లింగ్’ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. దాని తరువాత అతను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’. దశరథ్ డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. 2011 వ సంవత్సరం ఏప్రిల్ 22న ఈ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. ఫుల్ రన్లో ప్రభాస్ కెరీర్లోనే భారీ కలెక్షన్లను నమోదు చేసిన చిత్రమిది.ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ చిత్రం గురించి మనకు తెలియని చాలానే ఉన్నాయి.
‘సంతోషం’ తర్వాత రెండు మూడు యావరేజ్ లు తప్ప సరైన హిట్టు అందుకోలేక వెనుకపడ్డాడు దర్శకుడు దశరథ్. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను రెండేళ్లు కష్టపడి డెవలప్ చేసాడట. ‘ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువకుడు.. అతనికి తన అభిరుచి తగట్టు జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటాడు’. ఆ లైన్ తో దశరథ్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. అనేక నిర్మాణ సంస్థల చుట్టూ ఈ కథను పట్టుకుని తిరిగాడు. చివరికి దిల్ రాజు ఈ కథను చాలా మార్పులు చేయించి ఓకే చేసాడు.
ముందుగా ఈ కథని మహేష్ బాబుకి వినిపించాడట దర్శకుడు దశరథ్. అతన్ని దృష్టిలో పెట్టుకునే హీరో క్యారెక్టర్ ను డెవలప్ చేసుకున్నాడట. దిల్ రాజు రికమండేషన్ తో మహేష్ కు దశరథ్ ఈ కథను వినిపించాడట. కానీ మహేష్ దీనికి బదులు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథనే ఎంపిక చేసుకున్నాడట. మహేష్ రిజెక్ట్ చేసిన తరువాత హీరో సిద్దార్థ్ కు కూడా ఈ కథని వినిపించారట. ఎందుకో అతను కూడా ఈ కథని ఓకే చెయ్యలేదు.
చివరికి ప్రభాస్ కు వద్దకు వెళ్ళింది. అతను వెంటనే ఓకే చేసాడు. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. కానీ ఫైనల్ అవుట్ పుట్ చూసాక ప్రభాస్.. ఇందులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది అని దిల్ రాజుకి సూచించాడట. దాంతో మళ్ళీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశారు. నిజానికి మొదట షూట్ చేసినప్పుడు ప్రియ( హీరోయిన్ కాజల్) … ఫారిన్ వెళ్ళే సీన్స్ లేవట. ప్రభాస్ సలహా మేరకు దిల్ రాజు మళ్ళీ కాజల్ ఎపిసోడ్స్ ను జోడించినట్టు ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అది కూడా ఫారిన్ వెళ్లకుండా గ్రాఫిక్స్ లోమేనేజ్ చేసేసారట. ఏదైతేనేం సినిమా సూపర్ హిట్ అయ్యింది.