కొంతమంది హీరోల సినిమాలు ఎలా ఉంటాయో అంటే ఏ జోనర్‌లో ఉంటాయో ఈజీగా చెప్పేయొచ్చు. ఏ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారు అనేది గెస్ చేసేయొచ్చు. అయితే ఇప్పుడున్న హీరోల్లో ఇలా జోనర్‌ను కచ్చితంగా అవగాహన తెచ్చుకోలేని హీరో సుహాస్ (Suhas) . వరుసగా డిఫరెంట్ జోనర్‌లలో సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్‌తో ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే సినిమా చేశాడు. ఆ సినిమా థియేటర్లలో వచ్చి మంచి స్పందన అందుకుంది.
ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోవడానికి వస్తోంది. అవును ‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆహాలో ఈ నెల 24 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి అయితే 24 గంటల ముందే సినిమా స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉండనుంది. ఇక ఈ నెల 3న థియేటర్లలో సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇక సినిమా కథేంటంటే.. సూర్య (సుహాస్) రేడియో జాకీగా పని చేస్తుంటాడు.
ఓ ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోవడంతోపాటు.. ఫేస్ బ్లైండ్‌నెస్ (ప్రోసోపాగ్నోసియా) బారిన పడతాడు. ఆ సమస్య వల్ల ఎవరినీ గుర్తు పట్టలేని పరిస్థితి వస్తుంది. ఆఖరికి వాయిస్‌ని కూడా గుర్తించలేడు. తన స్నేహితుడు విఘ్నేష్ (వైవా హర్ష) (Viva Harsha)కి తప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే ఆద్య (పాయల్)తో (Payal Radhakrishna) ప్రేమలో పడతాడు. ఇంతలోనే సూర్య కళ్ల ముందు ఓ హత్య జరుగుతుంది. తనకున్న సమస్యతో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు.
కానీ, పోలీసులకి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశి సింగ్) దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. తన సమస్యనీ వివరిస్తాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ హత్య కేసులో సూర్యనే ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు? అనేదే కథ.