సంతాన భాగ్యం లేనప్పుడు ఐవీఎఫ్, సరోగసీ విధానాలను ఆశ్రయిస్తుంటారు. సగటు ప్రజల విషయంలో ఈ వివరాలు బయటకు రావు కానీ.. సెలబ్రిటీల విషయంలో ఈ వివరం బయటకు వచ్చేస్తుంటుంది. దీంతో ఎందుకు ఇలా చేశారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే మాతృత్వం కోసం ఆ తల్లి ఎంతగా ఎదురుచూశారో అనే విషయం మరచిపోవాలి. అలాగే ఈ పద్ధతిలో పిల్లల కోసం ప్రయత్నించేటప్పుడు పడే ఇబ్బందులనూ మనం తెలుసుకోవాలి.
Preity Zinta
తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రీతి జింటా (Preity Zinta). తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్ట సమయం గురించి వెల్లడించింది. పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు తాను పడిన బాధను కళ్లకు కట్టినట్లు వివరించింది ప్రీతి (Preity Zinta). ఆ సమయంలో ఒక్క రోజు కూడా సంతోషంగా గడపలేదని గుర్తుచేసుకుంది. అన్ని సమయాల్లో నవ్వుతూ అందంగా ఉండడం కష్టం. అందరి జీవితాల్లో లానే నా జీవితంలోనూ చెడ్డ రోజులు ఉన్నాయి.
నా లైఫ్‌లో ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు పడిన బాధను వివరించడానికి మాటలు చాలవు. ఆ సమయంలో విపరీతమైన బాధను అనుభవించాను. కొన్నిసార్లు తలను గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది అని ప్రీతి జింటా (Preity Zinta) చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడేది కాదట ఆమె. అయితే ఇంత కష్టపడి ప్రయత్నించినా.. ఆ ట్రీట్‌మెంట్ ఫలితాన్ని ఇవ్వలేదట. దీంతో సరోగసి ద్వారా తల్లినయ్యాను అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.
కెరీర్‌పై దృష్టిపెట్టడం ముఖ్యం. మహిళలు కుటుంబాన్ని చూసుకుంటూనే వృత్తిలోనూ రాణించాలి అని నేను నమ్ముతాను. అందుకే నా పిల్లలకు రెండు సంవత్సరాల వయసు రావడంతో తిరిగి వర్క్‌లో బిజీ కావాలని నిర్ణయించుకున్నాను అని చెప్పిందామె. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రీతి లాస్‌ఏంజెల్స్‌లో సెటిలైంది. అక్కడే 2021 నవంబర్‌లో సరోగసి విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఇక ఆరేళ్ల విరామం తరవాత ‘లాహోర్: 1947’తో మరోసారి తెరపైకి రావడానికి ప్రీతి రెడీ అవుతోంది.