గతవారం విడుదలై వరద భీభత్సాన్ని కూడా తట్టుకొని సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) . నాని (Nani) కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. ఎస్.జె.సూర్య (SJ Suryah) విలన్ పాత్ర, జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సినిమా సాధించిన విజయానందాన్ని అందరితో పంచుకొనేందుకు చిత్ర బృందం నిన్న సాయంత్రం హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో “విజయ వేడుక” నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రబృందం మొత్తం హాజరయ్యారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ను ఒకసారి చూద్దాం..!!
ఈ ఈవెంట్ కి నాని కేరళ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ తన అభిమానులను కలిసినప్పుడు వారు బహుకరించిన షర్ట్ వేసుకొచ్చానని, తనని వాళ్లు అ షర్ట్ సక్సెస్ మీట్ లో వేసుకోమన్నారని, అప్పటినుండి సక్సెస్ మీట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశానని పేర్కొన్నారు. అదే సందర్భంలో “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram ) చిత్రానికి మెయిన్ హీరో ఎస్.జె.సూర్య అని నాని పేర్కొనడం అతడి సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచింది. మరే హీరో ఈ విధంగా క్రెడిట్ ఇచ్చేవాడు కాదు. అలాగే.. వివేక్ ఆత్రేయకే ఈ విజయానికి సంబంధిన పూర్తి క్రెడిట్ అని చెప్పడం, వివేక్ తో మూడో సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ అని కన్ఫర్మ్ చేయడం నాని అభిమానులను ఆకట్టుకుంది.
మధురైలో షూటింగ్ మానుకొని ఈవెంట్ కి వచ్చాను – ఎస్.జె.సూర్య
డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ ఎస్.జె.సూర్యకి “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) సినిమాలోని దయ క్యారెక్టర్ తో వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఈవెంట్ కు రావడం కోసం మధురైలో ఓ పెద్ద సినిమా షూటింగ్ కు డుమ్మా కొట్టి, ఆ కాల్షీట్స్ డబ్బులు తానే కడతానని చెప్పి మరీ వచ్చానని సూర్య పేర్కొనడం విశేషం. తెలుగు సినిమా ప్రేక్షకులు తనపై కురిపిస్తున్న ప్రశంసలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో స్టేజ్ పై సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పి అలరించారు.
తేజ కి థ్యాంక్స్.. సినిమాలో తప్పులున్నా నటీనటులు సేవ్ చేసారు – వివేక్ ఆత్రేయ
సాధారణంగా సినిమాకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లను స్టేజ్ మీదకు పిలవడమే చాలా అరుదుగా జరిగే విషయం. సుకుమార్ (Sukumar) , బోయపాటి (Boyapati Srinu) , గోపీచంద్ మలినేని (Gopichand Malineni) వంటి అతితక్కువ మంది దర్శకులు మాత్రమే అలా చేశారు. అయితే.. నిన్నటి విజయ వేడుకలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తన డైరెక్షన్ డిపార్టుమెంటులో పని చేసిన తేజ అనే వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా అతనికి కృతజ్ఞతలు చెబుతూ, అతడి కుటుంబ సభ్యులు కూడా ఈవెంట్ కి హాజరయ్యేలా చేయడం అందరినీ మెప్పించింది. అదే సందర్భంలో సినిమాలో కొన్ని తప్పులున్నాయని, నటీనటుల పెర్ఫార్మెన్స్ తో ఆ మైనస్ ను కనబడనీయలేదని వివేక్ పేర్కొనడం అతడి నిజాయితీకి ప్రతీకగా నిలిచింది.
ఖుషి టైటిల్ వినబడగానే దద్దరిల్లిన ఆడిటోరియం
సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషించిన హర్షవర్ధన్ తన సహ నటుడు ఎస్.జె.సూర్య గురించి మాట్లాడుతూ “ఖుషి” (Kushi) అనే టైటిల్ చెప్పగానే ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది.
ఇక ఈవెంట్ చివర్లో సినిమాలో ఓ క్యారెక్టర్ ప్లే చేసిన పెద్దావిడ నానితో ఫోటో కోసం ప్రయత్నించడం గమనించిన నాని & ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan) కలిసి ఆవితో కలిసి ఫోటోకి ఫోజులివ్వడం మంచి స్వీట్ మూమెంట్ లా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.