కృష్ణ చైతన్య, రుచిత సాదినేని, కృష్ణతేజ, సుదర్శన్ (Cast)
అభిషేక్ మహర్షి (Director)
శివ ప్రసాద్ పన్నీరు (Producer)
ఎస్.అనంత్ శ్రీకర్ (Music)
రాంపి నందిగాం (Cinematography)
Release Date : ఆగస్ట్ 18, 2023
వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ హీరోగా నటించగా విడుదలైన తాజా చిత్రం “ప్రేమ్ కుమార్”. ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ కానీ పాటలు కానీ సినిమా మీద ఎలాంటి అంచనాలు నెలకొల్పలేకపోయాయి. అలాగే.. హీరో లేకుండా చేసిన ప్రమోషన్స్ కి కూడా మిశ్రమ స్పందన లభించింది. మరి ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!
కథ: లెక్కించలేనన్ని పెళ్లిళ్లు పెటాకులయ్యి.. ఇక పీటలెక్కడానికి పిల్ల దొరక్కపోవడంతో పిచ్చ ఫ్రస్టేషన్ తో పరాయి వాళ్ళ పెళ్లిళ్లపై పడతాయి ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్). పెళ్లిళ్లు, ప్రేమలు బ్రేకప్ చేయడమే వ్యాపారంగా “పీకే డిటెక్టివ్ ఏజెన్సీ” నడుపుతూ బ్రతికేస్తుంటాడు.
ఈ క్రమంలో పీకే చెడగొట్టడానికి ప్రయత్నించిన ఓ పెళ్లి అతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
అసలు పీకే పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోతుంటాయి? చివరికి పీకేకి పెళ్లి జరిగిందా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “ప్రేమ్ కుమార్” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా తన లుక్స్ & క్యారెక్టర్ తో కంటే డైలాగ్ డెలివరీతో ఎక్కువగా ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్. క్యారెక్టర్ వైజ్ ప్రెజంట్ యూత్ ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆ క్యారెక్టర్ ను నడిపిన తీరు వల్ల అది మిస్ అయ్యింది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎంత వెతికినా కనిపించదు. అందువల్ల పాత్ర ప్రయాణాన్ని ఎవరూ గుర్తించలేరు.
హీరోయిన్స్ గా నటించిన రాశి సింగ్ & రుచిత సాదినేనిల కంటే కృష్ణతేజ, సుదర్శన్ లకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. వాళ్ళ కామెడీ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది.
ఇక సినిమాలో సినిమా హీరోగా నటించిన కృష్ణ చైతన్య నటుడిగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి హావభావాలు చాలా కష్టంగా ఇరికించినట్లున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిలిమ్స్ & వెబ్ సిరీస్ లు “ప్రేమ్ కుమార్” సినిమా కంటే బెటర్ అవుట్ పుట్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు సినిమాకి ప్రొడక్షన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి వర్క్ చేసిందా లేదా అనే అనుమానం కలుగుతుంది. క్లైమాక్స్ కార్ చేజ్ సీక్వెన్స్ మొత్తం చాలా ఎబ్బెట్టుగా సాగుతుంది అందుకు కారణం సరైన ప్రొడక్షన్ డిజైన్ లేకపోవడమే. అలాగే.. సినిమా మొత్తాన్ని చాలా లిమిటెడ్ లొకేషన్ లో చుట్టేయడానికి చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఈమధ్య సినిమా ప్రేక్షకులు లొకేషన్లు కూడా గుర్తుపడుతున్నారని నవతరం ఫిలిమ్ మేకర్స్ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
అనంత్ శ్రీకర్ పాటలు సోసోగా ఉన్నాయి.. నేపధ్య సంగీతం మాత్రం చాలా సన్నివేశాలకి సింక్ అవ్వలేదు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వంశీ స్టైల్లో టైట్ క్లోజ్ షాట్స్ లో హీరోహీరోయిన్స్ ను చూపించాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. ఆ ఫ్రేమ్స్ లో హీరోహీరోయిన్లతోపాటు కాస్త సినిమా ఫ్లేవర్ & స్క్రీన్ బ్యూటీ కూడా కనిపించాలనే విషయాన్ని ఛాయాగ్రహకుడు పూర్తిగా విస్మరించాడు.
దర్శకుడు అభిషేక్ మహర్షి రాసుకున్న కథ కంటే కథను నడిపించే కథనంపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. కానీ.. ఆ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో విఫలమయ్యాడు. సినిమాలోని ట్విస్టులను ప్రేక్షకులు పావుగంట ముందే గుర్తించేసి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసే స్థాయిలో ఉంది అతడి రాత. దర్శకుడిగా కంటే రచయితగా ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు అభిషేక్. కొన్ని పంచ్ డైలాగులు బాగున్నాయి. అయితే.. ఒక ఫిలిమ్ మేకర్ గా అటు మేకింగ్ పై పూర్తి కమాండ్ లేక, ఇటు కథ-కథనాల మీద కచ్చితత్వం లేక బోర్లాపడ్డాడు.
విశ్లేషణ: హిట్టు కొట్టాలని సంతోష్ శోభన్ చేస్తున్న దండయాత్రల్లో భాగంగా విడుదలైన “ప్రేమ్ కుమార్” కూడా అతడి ఆశయాన్ని నెరవేర్చలేకపోయింది. అలాగే.. మేకింగ్ & క్వాలిటీ పరంగా చాలా లో స్టాండర్డ్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో ఆస్వాదించడం కూడా కష్టమే. ఇకనైనా దర్శకులు క్వాలిటీ ఫిలిమ్ మేకింగ్ అనేది ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోవాలని కోరుకుందాం.