గత వారం రిలీజ్ అయిన ‘మ్యాడ్’ సినిమా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఓ హీరోగా నటించిన సంగీత్ శోభన్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేశాడు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో సినిమా ‘ప్రేమ విమానం’. ఈరోజు నుండి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్న కారణంగా… ఈ ‘ప్రేమ విమానం’ పై ప్రేక్షకుల ఫోకస్ పడింది. మరి ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ: లచ్చు.. లక్ష్మణ్ (అనిరుధ్ నామా) ,అతని అన్న రాము (దేవాన్ష్ నామా).. లకి విమానం ఎక్కాలనే కోరిక ఎక్కువ. వాళ్ళు 24 గంటలూ అదే ధ్యాసలో ఉంటారు. అయితే వారిది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల వాళ్ళ తండ్రి (రవి వర్మ) అందుకు ఒప్పుకోడు. తల్లి సావిత్రమ్మ(అనసూయ) కూడా ‘అది మన స్థాయి కాదు’ అని నచ్చ చెబుతుంది.పిల్లల కోరిక కాదనలేక సావిత్రమ్మ భర్త.. తన వంతు ప్రయత్నం చేస్తాడు. కానీ తర్వాత ఊహించని విధంగా అతను అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని చనిపోతాడు. మరోపక్క మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ).. లది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.వాళ్లకు ఓ చిన్న కిరాణా కొట్టు ఉంటుంది.
పట్నం పోయి ఉద్యోగం చేయమని మణికి అతని తండ్రి ఎంత చెప్పినా వినడు. అది కాదన్నట్టు అతను ఆ ఊరి సర్పంచ్ కూతురు అయిన అభిత (శాన్వీ మేఘన)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం అభిత ఇంట్లో వాళ్లకు తెలియడంతో అభితకి పెద్దలు పెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల్ని ఎదిరించలేక.. మణి, అభిత..లు లేచిపోతారు. మరోపక్క లచ్చు, రాము విమానం ఎక్కాలనే అత్యుత్సాహంతో తన తల్లి వద్ద ఉన్న డబ్బు తీసుకుని ఆమెకు తెలియకుండా పట్నం వచ్చేస్తారు. ఈ క్రమంలో మణి, అభిత..లకి అచ్చు, రాము..లతో పరిచయం ఎలా ఏర్పడింది. తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ‘మ్యాడ్’ తో సంగీత్ శోభన్ బాగా ఇంప్రెస్ చేశాడు. మరీ ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.’ప్రేమ విమానం’ లో కూడా అక్కడక్కడ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.కానీ ఎమోషనల్ సన్నివేశాలు చూస్తుంటే సంగీత్ ఇంకాస్త ఇంప్రూవ్ కావాల్సి ఉందేమో అనిపిస్తుంది. అయితే ఇందులో కూడా అతని నటన మెప్పిస్తుంది. ఇక అభితగా శాన్వీ మేఘన గ్లామర్ పరంగా, నటన పరంగా కూడా బాగానే చేసింది.ఈ సినిమాకి ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ అనసూయ.
ఈ సినిమాలో మరోసారి ఆమె డీ గ్లామరస్ రోల్ చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో మరోసారి జీవించింది అని చెప్పాలి. అభిషేక్ నామా వారసులు అయిన చైల్డ్ ఆర్టిస్ట్ లు దేవాన్ష్, అనిరుధ్… బాగా నటించారు. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది అనే భావన అందరికీ కలుగుతుంది. వెన్నెల కిశోర్ కి మరోసారి తనకి అలవాటైన పాత్రే దొరికింది. కానీ నవ్వించలేకపోయాడు. సుప్రీత్ కూడా అంతే..! మిగిలిన నటీనటులు తమ వంతు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు సంతోష్ కట్టా ఎంపిక చేసుకున్న కథ కొత్తదేమీ కాదు. మొన్నామధ్య ‘విమానం’ అనే సినిమా వచ్చింది. ఇందులో కూడా ఓ పిల్లాడు విమానం ఎక్కాలని ఆశపడతాడు. ‘ప్రేమ విమానం’ లో కూడా లచ్చు, రాము పాత్రలు అలాగే ఉన్నాయి. ఇందులో కూడా అనసూయ ఉంది. ‘జీ5’ వారే ఈ సినిమాని కూడా నిర్మించడం జరిగింది. కాకపోతే అది థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇది నేరుగా ‘జీ5’ లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ‘విమానం’ లో ట్రాజెడీ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కి కన్నీళ్లు వస్తాయి.
కానీ ‘ప్రేమ విమానం’ లో అలా కాదు. ఇందులో కూడా ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ.. తర్వాత థ్రిల్లింగ్ అంశాలు కూడా జోడించి జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అనూప్ రూబెన్స్ నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇక్కడ ఇంకా పెట్టి ఉంటే బాగుండేది అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డారు.
విశ్లేషణ : స్టార్టింగ్ పోర్షన్ కొంత స్లోగా ఉంటుంది. కానీ తర్వాత బాగానే పికప్ అవుతుంది. సంగీత్ శోభన్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయ్యింది. చివరి 40 నిమిషాలు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ‘జీ5’ లో అందుబాటులో ఉంది. ఓటీటీ సినిమానే (Prema Vimanam) కాబట్టి.. ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus