మలయాళ సినిమాల గురించి ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం మాట్లాడుకుంటోంది. ఇటీవల కాలంలో అక్కడ విజయాలు రాలేదా? ఇదేనా ఆ విజయం అనుకుంటే కానే కాదు. అయితే రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అంటే మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇటీవలే తెలుగు వెర్షన్ రిలీజైనా థియేటర్ రన్ అయిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఆ సినిమానే ‘ప్రేమలు’ (Premalu) .
మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న సినిమా ‘ప్రేమలు’. నస్లెన్ కె.గఫూర్ (Naslen K) , మ్యాథ్యూ థామస్ , మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. గిరీశ్ ఎ.డి. (Girish A. D.) ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో మార్చి 8న వచ్చింది. కొత్త తరం ప్రేమకథతో, హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ సినిమాను ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏప్రిల్ 12 నుండి ‘ప్రేమలు’ స్ట్రీమింగ్ మొదలు కానుంది. ‘ఇప్పుడు ఈ ప్రేమ మరింత వైరల్ అవుతుంది’ అంటూ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే… సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గఫూర్) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. కాలేజీలో చేరగానే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విషయాన్ని చెప్పేందుకు ధైర్యం సరిపోదు. కాలేజీలో చివరిరోజు ఆ ప్రేమను చెబుతాడు.
అయితే ఆ అమ్మాయి వేరొకరితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమలో విఫలమైన సచిన్ బ్రిటన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో వీసా రాదు. దాంతో గేట్ కోచింగ్ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)తో కలసి హైదరాబాద్ వస్తాడు. రీనూ (మమిత బైజు) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ పెళ్లి వేడుకలో కలుస్తాడు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. ఈసారి సచిన్ ప్రేమకథ ఏమైంది అనేదే కథ.