‘ప్రేమమ్’పై గట్టి నమ్మకంతోనే ఉన్నారు

ఓ సినిమా రీమేక్ చేయడానికి రెండు కారణాలు. ఒకటి అసలు కథల కొరత. రెండోది మూలకథపై మక్కువ. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ప్రేమమ్’ రెండో కోవలోనికే వస్తుంది. అయితే ఇలాంటి రీమేక్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేస్తే మక్కీకి మక్కీ అని ఎక్కేస్తారు. క్రియేటివిటీ చూపించే క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. వీటన్నిటి మధ్యా రీమేక్ సినిమా ఒప్పుకోవడం దాంతో అందరినీ మెప్పించడం పెద్ద పరీక్షే. ప్రస్తుతం చందు మొండేటి పరిస్థితి ఇదే.

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ భాషతో నిమిత్తం లేకుండా భావంతో అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ మ్యాజిక్ తెలుగులో పునరావృతం చేయాలన్న క్రమంలో చేసిన ప్రయత్నమే తెలుగు రీమేక్. ‘కార్తికేయ’తో తొలి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు చందు మొండేటి. దీనికి సీక్వెల్ సహా, మరికొన్ని కథలు ఇతడి వద్ద సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ అక్కినేని వారి ప్రోద్భలంతో ‘ప్రేమమ్’ భాద్యతను తన భుజాలకెత్తుకున్నాడు చందు. ట్రైలర్ కంటే ముందు విడుదలైన ‘ఎవరే’ పాట (ఆడియో) ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అనిపించినా వీడియోపై భారీ విమర్శలొచ్చాయి. దాంతో సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి అయితే చిత్ర బృందం మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు.

నిన్న జరిగిన ఆడియో వేడుకలో సినిమా మొదలయ్యాక చందు క్రియేటివిటీ లెవెల్స్ తెలిసి ఈ సినిమా అతన్ని చేయడం తప్పు అనిపించిందని నాగచైతన్య చందుపై భరోసా కల్పించాడు. “ఒక్కసారి గెలిస్తే అదృష్టం అంటారు” అన్న నానుడి ప్రకారం ఈ సినిమా విషయంలో ఏదైనా జరిగితే అది చందు మీదికే వెళుతుంది. కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్యలు వస్తే అది ఎటు దారితీస్తుందో ఎవరూ అంచనా వెయ్యలేరు. అయితే ఇవన్నీ పట్టనట్టు “సినిమా విడుదలయ్యాక వచ్చిన స్పందన బట్టి మాట్లాడతానని” పూర్తి భాద్యత తీసుకున్నాడు చందు. దీనిబట్టి అర్థం అవుతుంది అతగాడికి సినిమాపై ఎంత నమ్మకం ఉందో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus