ఇండియన్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా పడ్డ హీరో, వాటిని అంతే బలంగా, బ్రహ్మాండంగా చూపించిన హీరోల్లో రీసెంట్‌గా ఎవరన్నా ఉన్నారంటే అది ‘పుష్ప’రాజ్ అనే చెప్పాలి. సుకుమార్, అల్లు అర్జున్ కలసి ఆ పాత్రను ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చొబెట్టారు. హీరో పాత్రకు ఎర్రచందనం స్మగ్లింగ్ అనే అంశం యాడ్ చేసి, మాస్ ఎలివేషన్లు, యాటిట్యూడ్‌లు మిక్స్ చేసి భలేగా చేశారు. ఇప్పుడు అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.
గత కొన్ని రోజులుగా ఇదే కాంటెక్స్ట్‌లో కొన్ని వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరైతే అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు జరిగిందేంటి? నిజంగా బన్నీని పృథ్వీరాజ్ ఇమిటేట్ చేశారా? అని చూస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికొచ్చింది. అదే ‘పుష్ప’ సినిమాకు ముందు ఇప్పుడు పృథ్వీరాజ్ చేసిన సినిమా కథ బయటకు వచ్చింది. ఆ లెక్కన ఇమిటేట్, కాపీ చేసే పరిస్థితే లేదు.
‘విలాయత్ బుధా’ అనే పేరుతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులోని ఓ సీన్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ నువ్వేమైనా పుష్పా అనుకుంటున్నావా అని హీరోను అడిగితే.. దానికి పృథ్వీరాజ్ అతను ఇంటర్నేషనల్ నేను లోకల్ అని అంటాడు. ఈ పాయింట్ కూడా పోలికకు ఓ కారణంగా మారింది. కానీ ఆ పోలిక అనే ఆలోచన అక్కర్లేదు అంటున్నారు మాలీవుడ్ జనాలు.
ఎందుకంటే 2020లో జీ.ఆర్.ఇందు గోపాలన్ అనే మలయాళ రచయిత విలాయత్ బుధా నవల రాశారు. దానికి ఆ రోజుల్లో మంచి పేరు కూడా వచ్చింది. ఒక స్కూల్ టీచర్ ఎర్రచందనం చెట్లను తన ఇంటి దగ్గర పెంచుతాడు. కోట్లు విలువ చేసే దాని మీద ఒక స్మగ్లర్ కన్నేసి.. ఎలాగైనా కొట్టేసి సొమ్ము చేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం ఏంటి, ఎలా జరిగింది అనేదే కథ. ఈ సినిమాను దీపావళికి తీసుకొస్తారని సమాచారం.