‘ఆడుజీవితం’ / ‘ది గోట్‌లైఫ్’ సినిమాలోని నటనకుగాను ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు నేషనల్ అవార్డు వస్తుందని చాలామంది ఊహించారు. ఆ సినిమాలో ఆయన నటన ఆ స్థాయిలో ఉంటుంది కూడా. అయితే షారుఖ్ ఖాన్, విక్రాంత్ మసేకి ఆ పురస్కారం దక్కింది. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్‌కి అవార్డు రాకపోవడం అన్యాయం అంటూ చర్చ మొదలైంది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ స్పందించారు. సినిమా ఉద్దేశం నెరవేరిందని, అవార్డు విషయం వదిలేద్దాం అని ఆయన చెప్పుకొచ్చారు.
నజీబ్ మహమ్మద్ (ఆడు జీవితం సినిమాలో ప్రధాన పాత్ర) గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో పని చేశాను. ‘ఆడుజీవితం’ సినిమా విజయవంతమవ్వాలని కోరుకున్నాను. ప్రేక్షకులకు నా నటన నచ్చాలని ఆశించాను. ఇలా నేను అనుకున్నవన్నీ జరిగాయి. అంతకుమించి ఈ సినిమా విషయంలో నేనేమీ ఆశించలేదు. అయితే సినిమాలో నటనకు నాకు అవార్డు వచ్చి ఉంటే ఆనందంగా ఉండేది. కానీ జరగలేదు అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నాడు.
పృథ్వీరాజ్‌కు అవార్డు దక్కకపోవడంతో జ్యూరీపై చాలా విమర్శలు వచ్చాయి. కావాలనే పృథ్వీరాజ్ సుకుమారన్‌ను విస్మరించారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే జ్యూరీ సభ్యుడు ప్రదీప్ నాయర్ ఈ విషయంలో స్పందించి విమర్శల జడివానను ఆపే ప్రయత్నం చేశారు. పృథ్వీరాజ్ నటనలో సహజత్వం లేదని జ్యూరీ ఛైర్‌పర్సన్ అశుతోష్ గోవారికర్, జ్యూరీ సభ్యులు భావించడంతో ఆయనకు అవార్డు దక్కలేదని తెలిపారు. ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా స్పందించి క్లారిటీ ఇచ్చేశారు.
మరోవైపు ‘ఉళ్లోళుక్కు’ చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి అవార్డుకు ఎంపికైన సీనియర్ నటి ఊర్వశి కూడా జ్యూరీపై అసహనం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పుడు ఉత్తమ నటిగా పరిగణించాలి కానీ.. ఉత్తమ సహాయ నటిగా ఎలా పరిగణిస్తారు అని ఆమె ప్రశ్నించారు. ఓ వయసు దాటితే సహాయ నటి అని ఫిక్స్ అయిపోతారా అని కూడా ప్రశ్నించారు. సైలెంట్‌గా అంగీకరించడానికి అవార్డేమీ పెన్షన్ కాదని ఆమె అన్నారు. మరి దీనిపై జ్యూరీ సభ్యులు ఏమంటారో చూడాలి.