నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ హీరో. క్రేజ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి చేతులు కాల్చుకోకుండా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘జాతి రత్నాలు’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి బ్లాక్ బస్టర్లు.. ఇతని ఖాతాలో ఉన్నప్పటికీ.. టాప్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు.. ఇతనితో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నప్పటికీ నవీన్ మాత్రం టెంప్ట్ అవ్వడం లేదు.
ఒక సినిమా చేసిన తర్వాతే ఇంకో సినిమా అన్నట్టు బండి లాగిస్తున్నాడు. ప్రస్తుతం అతను నాగవంశీ నిర్మాణంలో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత నవీన్ ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. మొన్నామధ్య దర్శకుడు మణిరత్నం.. వెళ్లి నవీన్ పోలిశెట్టి కథ చెప్పారు. నవీన్ కు కథ నచ్చింది. దీంతో సినిమా ఫిక్స్ అనుకున్నారు.
ఆ కథని తెలుగులో నవీన్ పోలిశెట్టితో, తమిళంలో శింబుతో చేయాలని మణిరత్నం అనుకున్నారు. కానీ ‘థగ్ లైఫ్’ రిజల్ట్ మణిరత్నం ప్లానింగ్ ను మార్చేసింది అని చెప్పాలి. తర్వాత నవీన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ఆ వెంటనే శింబు కూడా ఈ కథ వద్దనుకున్నట్టు సమాచారం. దీంతో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు మణిరత్నం రెడీ అయ్యారట. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది.