జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద పైరసీ రాకెట్‌ దొరికింది. సినిమా పరిశ్రమలో కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం చేసిన ఆ రాకెట్‌లో ఉన్నది ఒకే ఒక్కడు అంటే నమ్మగలరా. కానీ ఈ పని చేసింది ఒక్కడే. గత ఏడాదిన్నరలో 40 సినిమాలను థియేటర్లలో రికార్డు చేసి పైరసీ వెబ్‌సైట్లను అతడు అమ్మేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సినిమా విడుదలైన రోజే జాన కిరణ్‌ కుమార్‌ థియేటర్‌కు ప్రేక్షకుడిలా వెళ్లి హెచ్‌డీ క్వాలిటీలో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించాడని తేలింది.

‘హిట్‌ 3’, ‘సింగిల్‌’ సినిమాలు విడుదలైన రోజే హెచ్‌డీ ప్రింట్లు బయటకురావడానికి అతడే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జాన కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సినిమాల పైరసీలకు సంబంధించి ఓ గ్రూపు లింకు ద్వారా కిరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వాహకుల్ని సంప్రదించాడు. సినిమాలు రికార్డు చేసి పంపించేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమా విడుదల రోజే థియేటర్‌కు వెళ్లి చొక్కా జేబులో హెచ్‌డీ కెమెరా పెట్టుకుని రికార్డు చేశాడు.

ఆ వీడియోను టెలిగ్రామ్‌ ద్వారా పైరసీ వెబ్‌సైట్లకు పంపేవాడు. అలా ఒక్కో సినిమాకు 300 డాలర్ల నుండి 400 డాలర్లు చొప్పున సంపాదించాడు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకొని ఆ తర్వాత వివిధ సర్వీసుల ద్వారా రూపాయల్లోకి మార్చుకునేవాడు. రీసెంట్‌ సినిమాల పైరసీ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కలసి యాంటీ వీడియో పైరసీ సెల్‌కి ఫిర్యాదు చేశాయి. సినిమా ప్రదర్శితమైనప్పుడు మధ్యమధ్యలో తెరపై వచ్చే వాటర్‌మార్క్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కిరణ్‌ కుమార్‌ రికార్డు చేసిన సినిమాల్లో ఆ వాటర్‌ మార్కే పట్టించింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో సినిమాల్ని రికార్డు చేసినట్లు తేలింది. పైరసీ వీడియో ఉన్న విధానాన్ని బట్టి ఏ వైపు నుండి రికార్డింగ్‌ చేసి ఉంటారనే విషయంలో పోలీసులు అంచనాకు వచ్చి.. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ల ఆధారంగా నలుగురిని గుర్తించారు. ఆ తర్వాత అందులో కిరణ్‌ కుమార్‌ ఆ పని చేసినట్లు తేల్చారు. ఈ తీగను పట్టుకుని లాగితే పైరసీ డొంక ఎంతవరకు కదులుతుందో చూడాలి.

‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus