నాని – సుజీత్ కాంబినేషన్‌లో చాలా నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. అయితే అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ వేరు, ఇప్పుడొచ్చిన ప్రొడ్యూసర్ వేరు. ఆ విషయం పక్కనపెడితే.. ఆ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. అదే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని. దీనికి ఓ సమాధానంగా నాని ఈ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అని. అంటే ఆ హీరోయిన్ విషయంలోనే అనుకోండి. అవును రెండుసార్లు ఇప్పటివరకు కలసి నటించిన హీరోయిన్‌ను మరోసారి రిపీట్ చేయాలని నాని అనుకుంటున్నాడట.
ఆ మాటకొస్తే దర్శుడు సుజీత్ కూడా తన హిట్ కాంబోను రిపీట్ చేద్దామనే అనుకుంటున్నారు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అని. ‘ఓజీ’ సినిమాతో ఇటీవల మంచి విజయం అందుకున్న ప్రియాంక చేతిలో కొత్త సినిమాలేవీ లేవు. తమిళంలో ఓ సినిమా తప్ప. ఇప్పుడు నాని సినిమాతో బిజీ అవుతుంది అని అంటున్నారు. నాని తన దర్శకుల్ని రిపీట్ చేస్తాడేమో కానీ, హీరోయిన్లను రిపీట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడు. కానీ ప్రియాంకతో హ్యాట్రిక్ సినిమా అంటున్నాయి చిత్ర వర్గాలు.
నాని – ప్రియాంక కలసి ‘గ్యాంగ్ లీడర్’, ‘సరిపోదా శనివారం’ సినిమాలు చేశారు. రెండింటిలో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి ఆమె జూలియట్‌గా కనిపించబోతోంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో నాని ‘బ్లడీ రోమియో’ (రూమర్డ్ టైటిల్)గా కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. మాస్ టచ్ ఉన్న ప్రేమకథగా ఈ సినిమా ఉంటుంది అని సమాచారం.
ఇక నాని సినిమాల సంగతి చూస్తే.. ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుజీత్ సినిమా ప్రారంభించారు. మరి రెండు సినిమాలు పారలల్‌గా చేస్తాడా? లేక ‘ప్యారడైజ్’ అయ్యాకనే ‘బ్లడీ రోమియో’ అవుతాడా అనేది చూడాలి. రెండు పాత్రల స్వభావం దృష్ట్యా సైమల్‌టేనియస్ అనేది కష్టమే అని చెబుతున్నారు.