‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) లాంటి రూ. వెయ్యి కోట్ల సినిమా తీశారు కదా.. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) లైఫ్ స్టైల్ కూడా అంతే భారీగా ఉంటుంది అనుకోవద్దు. ఆయన గురించి ఏ మాత్రం తెలిసినా ఇలా అనుకోరు లెండి. సాదాసీదా మనిషిలానే తన లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే మనసులో ఏవేవో ఆలోచనలు ఉంటాయో ఏమో.. ఎప్పుడూ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాడు అని అంటుంటారు. అయితే మరీ కన్‌ఫ్యూజ్ కాదు కానీ.. చెప్పులు మరచిపోయేంత కన్‌ఫ్యూజన్.
అవును, నాగ్ అశ్విన్ తన చెప్పులేవో, ఇతరుల చెప్పులేవో కూడా మరచిపోతుంటారట. ఇతరుల చెప్పులు వేసుకుని వెళ్లిపోతుంటారట. ఈ విషయాన్ని ఎవరో చెప్పి ఉంటే పుకారు అని వదిలేసేవాళ్లం ఏమో. ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పింది ఆయనకు పిల్లనిచ్చిన మామయ్య.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt) . అవును ఆయనే తన అల్లుడి గురించి ఈ విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో వైలర్‌గా మారాయి.
నాగ్ అశ్విన్‌ను చూస్తే.. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. టీషర్ట్, కార్గో జీన్స్ వేసుకుని, స్లిప్పర్స్ ధరించి బయటికి వస్తుంటారు. సినిమా సెట్లో కూడా దాదాపు ఇలానే ఉంటారట. తన సినిమా ఈవెంట్‌లకు కూడా అలానే వచ్చేస్తుంటారు. ఆయన మొన్నీమధ్య ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజైనపుడు తెగిపోయిన స్లిప్పర్స్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఈ ప్రయాణం చాలా ఏళ్ల నుండి చెప్పులు అరిగిపోయేలా సాగింది అనేది ఆయన భావుకత.
అయితే ఇప్పుడు అశ్వనీదత్ మరో చెప్పుల కథ చెప్పారు. నాగ్ అశ్విన్ మా ఇంటికి హడావుడిగా వచ్చి, స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తారు. వెళ్లేటపుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే వచ్చేటపుడు వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు అని ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు అశ్వనీదత్. అంతగా ఏదో ఒక ఆలోచనతో ఉంటాడు అని మనకు ఆ మాటలతో అర్థమవుతోంది.