మిగతా ఇండస్ట్రీల కంటే ఎక్కువగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ అయితే గట్టిగానే నడుస్తోంది. ఒకప్పుడు ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు పోస్టర్స్ గోడ మీద ఎక్కువగా దర్శనమిచ్చేవి. ఇక ఇప్పుడు మాత్రం భారీ వసూళ్లు అందుకున్న పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కరోజులోనే 50 కోట్లు వారం రోజుల్లో రెండు వందల కోట్లు అంటూ అగ్ర హీరోల సినిమాల పోస్టర్ల ప్రకటనలు బాగానే వస్తున్నాయి .
అయితే అవన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి అంటూ ఇటీవల నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం ఎపి మినిస్టర్ పేర్ని నానితో చిత్ర ప్రముఖుల టాలీవుడ్ సమస్యలపై భేటీ నిర్వహించారు. అయితే ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
గతంలో ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిష్టర్ గా ఉన్నప్పుడు టికెట్ల రేట్ల విషయంపై చర్చలు జరిపాము. 200కోట్లు 600కోట్లు 2000కోట్లు అని కలెక్షన్స్ పోస్టర్స్ ఆ రేంజ్ లో ఉంటే మళ్ళీ మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడతారెంటని అడిగారు. అయితే ఆ ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అంటూ.. మా సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే మాత్రమే అలాంటి ప్రకటన ఇస్తుంటామని ఆయనతో చెప్పినట్లు వివరించారు. సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని మంత్రి పేర్ని నానికి సి.కళ్యాణ్ వివరణ ఇచ్చారు.