పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు అంటూ షటిల్ సర్వీసు చేస్తున్నాడు. దీంతో ఆయన పొలిటికల్ మోడ్‌లోకి వచ్చినప్పుడు సినిమాలు ఆగిపోతున్నాయి. అలా ‘భీమ్లా నాయక్’ తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. ఇదిగో మొదలు, అదిగో మొదలు అంటూ వార్తలు వస్తున్నా.. ఏదీ స్టార్ట్ అవ్వలేదు. దీంతో అభిమానులు, నిర్మాతలు నిరుత్సాహ పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తారు అంటూ వార్తలొచ్చాయి.
దీంతో ఇంత త్వరగా సినిమాల్లోకి పవన్ రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే అభిమానుల మొరను విన్నాడో, నిర్మాతల కష్టం చూశాడో, ఇంకేం కారణమో కానీ.. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడింది. దీంతో పవన్ నిర్మాతల నెత్తిన పాలు పోసినట్లయింది అంటున్నారు. దాంతోపాటు అభిమానుల ఆనందం కూడా ఆకాశాన్ని అంటుతోంది అని చెప్పొచ్చు.అక్టోబరు 2 నుండి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆ యాత్ర తాత్కాలికంగా నిలిపేశారట.
దీంతో పవన్ వెంటనే సినిమా సెట్స్‌లోకి వస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ సినిమా సెట్స్ మీద ఉన్నదీ అంటే ‘హరి హర వీరమల్లు’ మాత్రమే. సగం సినిమా ఇప్పటికే పూర్తయింది అంటున్నారు. ఆ లెక్కన అదే మొదలుపెట్టాలి. లేదంటే తక్కువ కాల్‌షీట్లతో పని అయిపోతుంది అంటున్న ‘వినోదాయ చిత్తాం’ మొదలుపెట్టాలి. ఈ రెండూ కాదనుకుని పవన్ ముందుకెళ్లాలి అనుకుంటే..
ఉందో, రద్దయిందో తెలియని హరీశ్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా స్టార్ట్ అవ్వాలి. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. అయితే అక్టోబరులో అనుకున్న బస్సు యాత్ర ఎక్కువ రోజులు వాయిదా పడితేనే నిర్మాతలకు ఆనందం. లేదంటే ఏదో ఒక్క నిర్మాతకే ఆనందం కలుగుతుంది. అభిమానులకు అయితే ఏదో ఒక సినిమా వస్తుందిలే అనే ఆనందం.