కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ఒకటి ఉందనే విషయం మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగు సినిమా ప్రముఖులు, యువ నటులు, సాంకేతిక నిపుణులు ఇలా చాలామంది ఈ కేసు విషయంలో కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత అనూహ్యంగా వాళ్ల తప్పు లేదు అని తేల్చేశారు. ఈలోపు బంజారా హిల్స్‌లోని ఓ ప్రముఖ హోట్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలకం రేగింది. ఈ కేసు మరోసారి టాలీవుడ్ మెడకు చుట్టుకుంటుందా?
ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఆయన ఈ మాటల్ని రాజకీయ విమర్శల్లా చేసినా.. దాని వల్ల ఫైనల్‌గా ఇబ్బంది పడేది టాలీవుడ్ జనాలే అని చెప్పొచ్చు. టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) ఇటీవల దుబాయిలో మరణించారు. ఆయన మరణం మీద చాలా అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో చాలా ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే ఇప్పుడు ఈ విషయం మీద ముఖ్యమంత్రి మాట్లాడటం మరింత చర్చకు దారి తీసింది.
టాలీవుడ్ రిలేటెడ్ డ్రగ్స్ కేసు నిందితులు వన్ బై వన్ ఎందుకు మరణిస్తున్నారు? ఎలా మరణిస్తున్నారు? అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సందర్భంలో అనడం తేనె తుట్టెను కదిలించినట్లు అయింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు చాలా కాలంగా విచారణలో ఉంది. ఇదిలా నడుస్తుండగా అక్కడక్కడ సినిమా జనాలు కొంతమంది డ్రగ్స్ విషయంలో పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రగ్స్ కేసు మీద సీఎం కామెంట్స్ ఇబ్బందికరంగా మారాయి.
ఇటీవల మృతి చెందిన కేదార్ టాలీవుడ్‌లో చాలా మందికి సన్నిహితుడు. అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) ఆయన స్నేహితుడు, సన్నిహితుడు. దేవరకొండ ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసేంత అనుబంధం ఆయనది. ఆ విషయం అటుంచితే కేదార్‌తో స్నేహం ఉన్న వాళ్లు ఎవరూ రీసెంట్ టైమ్స్ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు, కేదార్ (Kedar Selagamsetty) మరణం పొలిటికల్ టర్న్ తీసుకుంటే టాలీవుడ్‌లో ప్రకంపనలు వస్తాయి అంటున్నారు.