ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియాలో ఎక్కువగా హిందీ కంటెంట్ కే ఫోకస్ పెట్టేది. తెలుగు, తమిళ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు దక్షిణాది కంటెంట్‌ను అందుకోవడంలో ముందంజలో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్ తెలుగుకు ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ వరుస సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నది. దీనికి కారణం వీటి వ్యూయర్‌షిప్‌లో కనిపించిన మార్పు. భారీ బడ్జెట్ హిందీ సినిమాలకు ఇస్తున్న రేటు కన్నా తక్కువ ఖర్చుతో తీసుకున్న తెలుగు చిత్రాలు ఎక్కువ వీక్షకులను ఆకర్షిస్తున్నాయట.
ఇటీవల నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maaharaj) నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా రీజనల్ కంటెంట్ అనుకున్న ఈ సినిమా ఇండియా లెవెల్లో టాప్‌లో నిలవడం విశేషం. ముఖ్యంగా మలయాళీ, హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడటం అందరికీ షాక్ ఇచ్చింది. ఇదే ట్రెండ్ ముందు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాకు కూడా కనిపించింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఈ చిత్రం ఏకంగా 13 వారాలు వరుసగా నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నిలిచి రికార్డు నెలకొల్పింది.
పాన్ ఇండియా సినిమాల సంగతి పక్కన పెడితే, అసలు ఆ రేంజ్‌లో ప్రమోట్ కాకపోయినా తెలుగు సినిమాలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటం గమనించదగ్గ విషయం. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ట్రైలర్ రిలీజ్ కాకముందే మొదటి భాగానికి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సెట్ అవుతున్నాయి. అంతకు ముందు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘దేవర’ (Devara), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద రేంజ్‌లో స్ట్రీమింగ్ అయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.
ఈ ట్రెండ్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్, ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలను కొనుగోలు చేసే పనిలో పడిందని సమాచారం. స్టార్ హీరోల సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ఇక ముందు స్ట్రీమింగ్ గేమ్ ఇంకా మళ్లీ మారనుందనే టాక్ వినిపిస్తోంది. అలా తెలుగు సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ (Netflix) పెద్దగా లాభపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ హవా ఇంకా ఎలాంటి స్థాయికి చేరుకుంటుందో చూడాలి.