సినిమా టికెట్ రేట్ల గురించి అంత చర్చ ఎందుకు పెడుతున్నారు. రూ.1500 చెల్లించి టికెట్లు తీసుకొని నలుగురు వెళ్లి పొందే వినోదం మీకు ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత సరసమైన ధరకు ఎంటర్‌టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటూ.. ఇటీవల నిర్మాత నాగవంశీ పెద్ద లెక్కరే ఇచ్చారు. సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అయ్యాయి అనే కామెంట్స్ వస్తున్నాయి అనే మాటలకు ఆయన రిప్లై లాంటివి పై మాటలు. దీని నెటిజన్లు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా..
నిర్మాత సురేశ్‌బాబు (Suresh Babu) మాటలు నెటిజన్లకు సపోర్టు చేసేలా ఉన్నాయి. మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) , కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కలసి (?) నిర్మించిన ‘దేవర 1’ (Devara) సినిమాను గంపగుత్తగా కొనేసి రిలీజ్ చేసి నిర్మాత అయ్యారు నాగవంశీ (Suryadevara Naga Vamsi) . తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధర పెంపు, షోల పెంపునకు సంబంధించిన అన్ని విజ్ఞప్తులు, లెక్కలు ఆయన చేతుల మీదుగానే సాగాయి. ఈ క్రమంలో టికెట్ ధరలు ఎక్కువయ్యాయి అనే టాక్ వచ్చింది. ఇక వసూళ్ల విషయంలో వస్తున్న విమర్శలకు ‘పోస్టర్లకు కారణం అభిమానుల కళ్లలో ఆనందమే’ అని ఆయనే చెప్పేశారు.
సినిమా టికెట్ ధరల మీద ఆయన వ్యాఖ్యలు గురించి మొన్నీమధ్య మన సైట్‌లో కూడా ఓ వివరణ మీరు చదివే ఉంటారు. గతంలో సురేశ్‌బాబు లాంటివాళ్లు టికెట్ ధరల గురించి చేసిన వ్యాఖ్యలను అందులో ప్రస్తావించాము కూడా. అయితే తాజాగా మరోసారి సురేశ్ బాబు టికెట్ ధరల గురించి ప్రస్తావించారు. దీంతో ‘విన్నారా నాగవంశీ.. సురేశ్‌బాబు ఏమంటున్నారో?’ అని సూచిస్తున్నారు. తమిళనాడులో సినిమా టికెట్ల రేట్లు నియంత్రణలో ఉంటాయి.
మన దగ్గరా అలానే ఉన్నా.. పెద్ద హీరోల సినిమాల విషయంలో పెంపుదల కోసం కోరుతున్నారు. ధరల పెంపు కారణంగా త్వరగా లాభాలు వస్తాయని మేకర్స్ అనుకుంటున్నారు. తక్కువ ధర ఉన్నప్పుడే సామాన్యులు సినిమాలు చూస్తారు. ఎక్కువ ధరల కారణంగా లాభాలు వస్తాయని భావించడం కంటే సామాన్యులు సినిమాలకు దూరం అవుతున్నారే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని సురేష్ బాబు చెప్పారు.
ఎక్కువ ధరలు పెట్టి థియేటర్లలో సినిమాలు చూడటం కంటే.. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అక్కడ చూడొచ్చు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగే అవకాశం ఉంది. అందుకే టికెట్ల ధరల పెంపు విషయంలో నిర్మాతలు మరోసారి ఆలోచించుకోవాలి అని సురేశ్ బాబు కోరారు. ఈ లెక్కన యువ నిర్మాత చెప్పింది కరెక్టా? సీనియర్ నిర్మాత చెప్పింది కరెక్టా అనేది చూడాలి.