టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మిస్టర్ బచ్చన్ రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ ను నిందిస్తున్నట్టు కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు టీజీ విశ్వప్రసాద్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.
మిస్టర్ బచ్చన్ సినిమా అలా రావడానికి కారణం హరీష్ శంకర్ అని నేను చెప్పినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మొదట నాకు మంచి ఫ్రెండ్ అని ఆయన తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా కోసం మేమిద్దరం కలిసి పని చేశామని మేకింగ్ పరంగా ప్రతిసారి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటామని ఇదే అంశాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పానని ఆయన అన్నారు.
సినిమా సక్సెస్ అయితే ప్రశంసలు అందుతాయని ఒక సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే చాలామంది విభిన్నమైన కామెంట్లు చేస్తారని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. అభినందనలను ఎలా తీసుకుంటామో విమర్శలను సైతం అదే విధంగా తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని హరీష్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమేనని విశ్వప్రసాద్ తెలిపారు.
సినిమాను అద్భుతంగా తెరకెక్కించగల టాలెంట్ హరీష్ శంకర్ కు ఉందని హరీష్ శంకర్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. తన రెమ్యునరేషన్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ గురించి అసత్య ప్రచారం చేయొద్దని నేను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. హరీష్ శంకర్ భవిష్యత్తు సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.