Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు
- April 9, 2026 / 06:26 PM ISTByFilmy Focus Desk
సింగిల్ స్క్రీన్ థియేటర్ల పంచాయితీ ఇక తేలిపోయిందని, వాళ్ల నష్టాలకు బ్రేక్ పడుతుంది అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చిన్న ఆనందం కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ఆనందాన్ని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నీరుగార్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానంపై సినిమాలు ప్రదర్శించేలా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటోంది..
Theatres
సినిమాల ప్రదర్శనలో పాత పద్ధతి (అద్దె పద్ధతి)నే కొనసాగించాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. కొత్త సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి, షరతుల మేరకు సినిమాలు విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు టీఎఫ్‌సీసీకి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు కలసి ఓ లేఖ రాశారు. ఈ గిల్డ్‌లో రవిశంకర్ యలమంచిలి (మైత్రీ మూవీమేకర్స్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), రవికిశోర్ (స్రవంతి మూవీస్), సుప్రియ యార్లగడ్డ (ఎస్‌ఎస్ క్రియేషన్స్), స్వప్న దత్ (స్వప్న సినిమాస్), సుధాకర్ చెరుకూరి (ఎస్‌ఎల్‌వీ సినిమాస్), బాపినీడు (ఎస్‌వీసీసీ), సాహు గారపాటి (షైన్ క్రియేషన్స్) తదితరులు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు.

ఇక రెంటల్ పద్ధతికి బదులు మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని హైదరాబాద్‌లోని 23 థియేటర్లు నిర్ణయించినట్లు టీఎఫ్‌సీసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శితమైన తొలి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం షేర్ ఇచ్చేలా డీల్ కుదిరింది. అంతేకాదు ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలను కేవలం పర్సంటేజీ ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని టీఎఫ్‌సీసీ చెప్పింది. విడతల వారీగా ఈ పని జరుగుతుందని కూడా చెప్పారు.
దీంతో సింగిల్ స్క్రీన్ల సమస్యలు తీరిపోయాయని, వారు నష్టాల నుండి బయటకపడతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే టాలీవుడ్‌లో కీలకంగా సినిమాలు చేస్తున్న నిర్మాతలు మేం వారికి సినిమాలు ఇవ్వం అంటున్నారు. మరేమవుతుందో చూడాలి.










