భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే ఆ ప్రభావం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లపై ఊహించని స్థాయిలో పడుతుందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అలా భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో లైగర్ సినిమా ఒకటి కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని సమాచారం. ఈ స్థాయిలో నష్టాలు అంటే భరించడం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు సులువు కాదు.
లైగర్ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో జనగణమన సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూట్ పూర్తైనా ఆ సినిమా షూట్ ఆగిపోయింది. ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ఈ సినిమా గురించి స్పందించడానికి విజయ్ దేవరకొండ సైతం ఏ మాత్రం ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే. అయితే పూరీ, జగన్నాథ్, ఛార్మీ ఈ సినిమా వల్ల తమకే భారీగా నష్టాలు వచ్చాయని నష్టాలను భర్తీ చేయడానికి
తమ దగ్గర డబ్బులు లేవని రూపాయి కూడా ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు చెప్పారని బోగట్టా. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఛాంబర్ గడప తొక్కాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అలా జరగని పక్షంలో పూరీ జగన్నాథ్ భవిష్యత్తు సినిమాలకు ఇబ్బందులు తప్పవని సమాచారం. ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే తరహా సమస్య ఎదురైతే దర్శకుడు కొరటాల శివ తన వంతుగా నష్టాలను భర్తీ చేసి సమస్యను పరిష్కరించారు.
ఆచార్యకు అధికారికంగా కొరటాల శివ నిర్మాత కాదు. అయితే లైగర్ సినిమాకు మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో పాటు నిర్మాత అనే సంగతి తెలిసిందే. లైగర్ రిజల్ట్ గురించి ఈ సినిమా నష్టాల గురించి రాబోయే రోజుల్లో పూరీ జగన్నాథ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.