అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేషమైన బిజినెస్ జరిగింది. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించింది. సినిమా ట్రైలర్ వేడుకతో పాటు ఏడాది ప్రధాన నగరాలలో మెగాప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. మామూలుగా సినిమా ప్రమోషన్స్‌కి టీజర్లు, ట్రైలర్లు, ఈవెంట్స్‌లను మాత్రమే వినియోగిస్తారు.
కానీ ‘పుష్ప 2’ మేకర్స్ కొత్త పంథాను ఎంచుకున్నారు. కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించడం ఇండస్ట్రీలో కొత్త ఒరవడిగా నిలుస్తోంది. ప్రముఖ కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో మరింత బలంగా ప్రవేశపెట్టడానికి ‘పుష్ప 2’ హైప్‌ను ఉపయోగించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లను ఈ మూవీతో కలిపి ప్రమోట్ చేసేందుకు 10 నుంచి 20 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
మొత్తం సినిమా ప్రమోషన్ ఖర్చు దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని, ఇది కార్పొరేట్ ఒప్పందాల ద్వారా సులభంగా మేనేజ్ అవుతుందని టాక్. గతంలో రాజకీయ నేతల విషెస్ ప్రచారంలో కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నట్లు, ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో బ్రాండింగ్‌లో కొత్త మైలు రాయిని చేరుతున్నాయి. ఈ విధానం వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో సినిమాల ప్రమోషన్స్ కోసం మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రాక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటి వరకు టెలివిజన్, డిజిటల్ మీడియా షోలకు మాత్రమే కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్స్‌గా ఉన్నారు. కానీ ‘పుష్ప 2’ రిలీజ్ ప్రమోషన్‌లో వారి భాగస్వామ్యం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమా కార్పొరేట్ ప్రమోషన్స్ ఇండస్ట్రీలో ఒక కొత్త దిశగా మారుతుందని, ఇతర పెద్ద చిత్రాలకు ఇదే రూట్ మార్గదర్శకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.