Pushpa Review: పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

“రంగస్థలం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ “పుష్ప”. “అల వైకుంఠపురములో” లాంటి క్లాస్ హిట్ అనంతరం అల్లు అర్జున్ నటించిన ఊర మాస్ సినిమా ఇది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి పార్ట్ “పుష్ప: ది రైజ్” నేడు (డిసెంబర్ 17) విడుదలైంది. ఆఖరి నిమిషం వరకూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడ్డారు. అయితే.. మన లెక్కల మాష్టారు మాత్రం ముంబైలో వారంరోజులు కష్టపడి రిలీజ్ కి సినిమాని రెడీ చేశారు. మరి సుకుమార్-అల్లు అర్జున్ ల కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందో లేదో చూద్దాం..!!

 

కథ: కొండ రెడ్డి, జాలి రెడ్డి, జక్కా రెడ్డిలు కలిసి చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ బిజినెస్ లో కూలీగా పనిచేయడం మొదలెట్టి పార్ట్నర్ స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). సరిగ్గా అదే సమయానికి పుష్ప ఎదుగుదలకు అడ్డు తగులుతాడు మంగళం సూరి (సునీల్) మరియు అతడి సతీమణి దాక్షాయణి (అనసూయ). వాళ్ళందరినీ ఎదిరించి ఎర్ర చందనం స్మగ్లింగ్ కు డాన్ గా పుష్పరాజ్ ఎలా ఎదిగాడు? అసలు భన్వర్ సింగ్ (ఫహాద్ ఫాజిల్) ఎవరు? ఎందుకు పుష్పరాజ్ ఎదుగుదలను అడ్డుకుంటాడు? అనేది మొదటి పార్ట్ కథాంశం.

నటీనటుల పనితీరు: “అల వైకుంఠపురములో” సాఫ్ట్ & క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన బన్నీ.. “పుష్ప”లో ఊర మాస్ పెర్ఫార్మెన్స్ తో ఇరగ్గొట్టాడు. ఈ రేంజ్ మాస్ క్యారెక్టర్ ను బన్నీ తప్ప ఎవరు చేయలేరు అని ప్రేక్షకులు అనుకునేలా క్యారెక్టర్ లో జీవించాడు. ఆ రస్టిక్ క్యారెక్టర్ లో నటించడానికి దమ్ము మాత్రమే కాదు ఓపిక కూడా ఉండాలి. యాక్షన్ బ్లాక్స్ లో బన్నీ మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి. రష్మిక మందన్న గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది.

ఆమె క్యారెక్టర్ కి పెద్దగా డెప్త్ లేదు. ఫహాద్ ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కన్నడ నటుడు ధనంజయ్ క్యారెక్టరైజేషన్ బాగుంది. వీళ్ళందరికంటే సునీల్ నటన బాగుందని చెప్పాలి. అందరూ విలన్లను తన పెర్ఫార్మెన్స్ తో పక్కనపెట్టేశాడు సునీల్. మనోడి మేకప్ & నటన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

సాంకేతికవర్గం పనితీరు: పాటలతో ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతంతో మాత్రం నిరాశపరిచాడు. ఇంట్రడక్షన్ & సెకండాఫ్ ఫైట్ తప్ప ఒక్క సన్నివేశం కూడా దేవి మ్యూజిక్ వల్ల ఎలివేట్ అవ్వలేదు. ముఖ్యంగా సౌండ్ మిక్సింగ్ బాలేదు. మరి సుకుమార్ తక్కువ టైం ఇవ్వడం వల్ల అవుట్ పుట్ ఇలా వచ్చిందో ఏమో తెలియదు కానీ.. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మాత్రం సోసోగా ఉంది. ఫారిన్ సినిమాటోగ్రాఫర్ మీరోస్లా నేచర్ ను బాగానే చూపించాడు కానీ.. తన సినిమాటోగ్రఫీతో ఎలివేషన్స్ ను మాత్రం ఇవ్వలేకపోయాడు.

ఒక దర్శకుడి కథను తెరపై చూపించాల్సిన బాధ్యత కెమెరామెన్ దే. దాన్ని నిర్వర్తించడంలో మీరోస్లా ఫెయిల్ అయ్యాడు. హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎడిటర్ కి కూడా ఇంకాస్త ఎక్కువ టైం ఇచ్చి ఉంటే బాగుండేది. దర్శకుడిగా సుకుమార్ సాధారణ కథలను, అసాధారణంగా తెరకెక్కిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే.. సుకుమార్ సినిమాలకి వచ్చే జనం ఎప్పుడూ కథను పట్టించుకోరు, సదరు కథలోని క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేస్తారు. ఈ చిత్రంలో ఒక సాధారణ యువకుడు డాన్ గా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని సుకుమార్ తనదైన శైలిలో చెప్పాలి అనుకున్నాడు.

అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆర్క్ అదిరింది కూడా. అయితే.. అల్లు అర్జున్ రేంజ్ క్యారెక్టరైజేషన్ మిగతా ఆర్టిస్టులకు కొరవడింది. ఏ ఒక్కరి పాత్రలోనూ పటుత్వం కనిపించదు. సో, “పుష్ప” సినిమాని క్యారెక్టర్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సదరు పాత్రధారుల మేకోవర్ పై పెట్టిన శ్రద్ధలో సగం క్యారెక్టరైజేషన్ పై కూడా సుకుమార్ పెట్టి ఉంటే మరో రేంజ్ లో ఉండేది. ఫహాద్ ను మాత్రం సుకుమార్ వేస్ట్ చేసుకున్నాడు. భారీ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ ను సరిగా వినియోగించుకోలేకపోయాడు సుకుమార్. ఆ కారణంగా కథకుడిగా, దర్శకుడిగా మన లెక్కల మాష్టాలు బొటాబొటి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పొచ్చు.

విశ్లేషణ: సుకుమార్ సినిమా అంటేనే లాజిక్ తో మ్యాజిక్ కనిపిస్తుంది. అయితే.. మాస్ సినిమా కాబట్టి లాజిక్ ను మరిచి, క్యారెక్టర్జ్స్ తో డెప్త్ కోరుకోకపోతే.. “పుష్ప” కచ్చితంగా మెప్పిస్తుంది. అయితే.. సుకుమార్ మీద డిసెంబర్ 17 విడుదల అనే టెన్షన్ లేకపోయి ఉండుంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది. అయినప్పటికీ.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్ కోసం, టెర్రిఫిక్ యాక్షన్ బ్లాక్స్ కోసం “పుష్ప”ను థియేటర్లలో ఒకసారి చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus