మళ్ళీ రెండు నెలల అనంతరం సినిమా థియేటర్లలో ప్రేక్షకులు రద్దీగా ఉన్నారు. అలాగే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవతున్నాయి. ఇది ‘పుష్ప 2: ది రూల్’కు (Pushpa2 The Rule) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించింది. అయితే, బాహుబలి 2 (Baahubali 2) స్థాయికి చేరలేకపోయినా, పుష్ప 2 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
గతంలోనే బాహుబలి 2: ది కంక్లూజన్ మొదటి రోజున 1.05 కోట్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సౌత్ సినిమా క్రేజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటి వరకు ఆ రికార్డును దాటడం ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే, పుష్ప 2 ఈ జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి రోజున 71 లక్షల ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అల్లు అర్జున్ పవర్ఫుల్ యాక్టింగ్, సుకుమార్ (Sukumar) ఆడియన్స్‌ను ఆకట్టుకునే నేరేషన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం (Devi Sri Prasad) కలిసి పుష్ప 2కు అద్భుతమైన క్రేజ్‌ను తెచ్చాయి.
ఈ క్రేజ్ కారణంగా థియేటర్ల వద్ద పుష్ప 2కి భారీ సంఖ్యలో ప్రేక్షకులు చేరారు. ఫుట్ ఫాల్స్ పరంగా కేజీఎఫ్ చాప్టర్ 2ని అధిగమించిన ఈ చిత్రం, మొదటి రోజున 70 లక్షల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన కేజీఎఫ్ (KGF 2) 2ని కొద్దిగా తక్కువ తేడాతో దాటింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ 58 లక్షల ఫుట్ ఫాల్స్‌ను సాధించి ఆ టైమ్‌లో రికార్డులను సృష్టించింది. కానీ పుష్ప 2, ఆర్ఆర్ఆర్ (RRR) రికార్డును మించి రెండో స్థాయికి చేరుకుంది.
ఈ రిజల్ట్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన భారీ స్పందనను కూడా చూపుతోంది. హిందీ మార్కెట్‌లో పుష్ప 2ను చూసిన ప్రేక్షకుల సంఖ్య ఈ రికార్డుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్ప 2 సాధించిన ఈ ఫుట్ ఫాల్స్ రికార్డు, బన్నీకి పాన్ ఇండియా స్టార్‌గా మరింత గుర్తింపును తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.