విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన మూడో చిత్రం “పుష్పక విమానం”. దామోదర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ లో నిర్మించడం విశేషం. సినిమా ప్రమోషన్స్ ను తారా స్థాయిలో చేశారు. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి ఈ నవతరం వింత గాధ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఓ కుగ్రామంలోని స్కూల్లో టీచర్ గా పని చేసే సాధారణ యువకుడు చిట్టిలంక సుధాకర్ (ఆనంద్ దేవరకొండ). పెద్దలు నిశ్చయించిన మీనాక్షీ (గీత్ సైని)ని వారి ప్రోద్భలంతో పెళ్లాడి కొత్త జీవితం మొదలెట్టాలని బోలెడు ఆశలతో పగటి కలలు కంటుంటాడు. కట్ చేస్తే.. పెళ్ళైన కొన్ని రోజులకే మీనాక్షీ ఎవరితోనో లేచిపోతుంది. దాంతో ఊహా ప్రపంచం మొత్తం కల్లోలమవుతుంది. సంఘంలో పరువు కోసం షార్ట్ ఫిలిమ్ యాక్టర్ రేఖ (శాన్వి మేఘన)ను కొన్నాళ్లపాటు తన భార్యగా నటించడానికి ఒప్పించి, ఆమెతో వేగలేక నానా బాధలూ పడుతూ ఉంటాడు.
మళ్ళీ కట్ చేస్తే.. లేచిపోయిన మీనాక్షీ మర్డర్ చేయబడిందని తెలుస్తుంది పోలీసులకి. ఆ మర్డర్ చేసింది సుధాకర్ అని భావించి పోలీసులు (సునీల్) మన హీరోని అరెస్ట్ చేసి చితక్కొడుతుంటారు. అసలు మీనాక్షీ ఎవరితో లేచిపోయింది? ఆమెను హత్య చేసింది ఎవరు? ఈ కేసు నుంచి సుధాకర్ ఎలా తప్పించుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధాన రూపమే “పుష్పక విమానం”.
నటీనటుల పనితీరు: సుధాకర్ పాత్రలో ఆనంద్ దేవరకొండ భలే ఒదిగిపోయాడు. చాలా వరకూ కంట్రోల్డ్ & సబ్టల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే స్థాయికి ఇంకా ఆనంద్ చేరుకోలేదు. కథ మొత్తం మనోడి క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుంటుంది. అందువల్ల చాలా చోట్ల కాస్త గాడి తప్పి ఇబ్బంది పడ్డాడు. ఓవరాల్ గా మాత్రం ఆనంద్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. కీలకమైన పాత్రైనటువంటి మీనాక్షిగా గీత్ సైని పర్వాలేదనిపించుకుంది. అయితే..
ఆమె పాత్రకు ఇంకాస్త డెప్త్ ఉన్న క్యారెక్టరైజేషన్ అవసరం. శాన్వి మేఘన కామెడీతో ఆకట్టుకుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. సీరియస్ పోలీస్ గా సునీల్ నవ్వించడానికి ప్రయత్నించగా.. వైవా హర్ష అక్కడక్కడా నవ్వించాడు. హర్షవర్ధన్ పాత్ర భలే టిపికల్ గా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: రామ్ మిరియాల – సిద్ధార్ధ్ సదాశివుని-అమిత్ దాసాని త్రయం అందించిన సంగీతం సోసోగా ఉంది. నేపధ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. హస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, కామెడీలో థ్రిల్లర్ ను కెమెరా యాంగిల్స్ లో బాగా ఎలివేట్ చేశాడు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్. ఆడియన్స్ ల్యాగ్ ఫీల్ అవుతున్నారు అనే సమయానికి మంచి సీక్వెన్స్ తో రిలీఫ్ ఇచ్చాడు.
ఇక దర్శకుడు దామోదర పాత్రలను రాసుకున్న విధానం బాగున్నప్పటికీ.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. కామెడీలో థ్రిల్లర్ అనే జోనర్ ఆల్రెడీ ఆర్జీవీ “క్షణం క్షణం” తోనే రుచి చూపించారు. అలాంటి జోనర్ లోనే సినిమా తీస్తున్నప్పుడు కొత్తదనమే కాదు ఆసక్తికరమూ చాలా అవసరం. దామోదర ఎంచుకున్న కథలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ఆ కథను నడిపించిన కథనంలో సాగతీత కారణంగా ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. దాంతో మంచి స్కోప్ ఉన్న సినిమా జస్ట్ ఒన్ టైమ్ వాచ్ లా మిగిలిపోయింది.
విశ్లేషణ: మరీ భారీ అంచనాలు ఈ సినిమా మీద ఎలాగూ ఉండవు కాబట్టి.. ప్రేక్షకులు భారీగా డిజప్పాయింట్ అయ్యే అవకాశాలు లేవు. అయితే.. సినిమాను కామెడీ చిత్రంగా ప్రమోట్ చేసి.. మర్డర్ మిస్టరీని ఇంటర్వెల్ టైమ్ కి రివీల్ చేయడం బాగానే ఉన్నప్పటికీ.. ఆడియన్స్ మైండ్ సెట్ ను కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ విషయంలో చిత్రబృందం కాస్త ముందు జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయితే.. ఒకసారి టైమ్ పాస్ కోసం చూసేయొచ్చు.