ఇప్పుడున్న ఓటిటిలకి విభిన్నంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కంటెంట్ ను అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఓటిటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది ‘ఆహా’ ఓటిటి అనే చెప్పాలి. కొత్త సినిమాలు,వెబ్ సిరీస్ లు, టాక్ షోలతో ‘ఆహా’ అనిపించే విధంగా దూసుకుపోతుంది. ఇందులో ఏ సినిమా/వెబ్ సిరీస్ రిలీజ్ అయినా అది మంచి కంటెంట్ ఉన్నదే అయ్యుంటుంది అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అందుకే ‘ఆహా’ లో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ప్రత్యేకమైనవిగా చూస్తుంటారు.
తాజాగా ‘ఖుబూల్ హై’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వద్ద నుండీ ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరిగే బాల్య వివాహలు, క్రైమ్ ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. మరి ప్రేక్షకుల్ని ఎంత వరకు అలరించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: మనకి ఎంతో అందంగా కనిపించే హైదరాబాద్లో.. పాత బస్తీలో ఉండే చీకటి కోణాల్ని వెలికి తీసి ఆవిష్కరించిన చిత్రమిది. అక్కడ ఉండే ముస్లింలు వాళ్ళ అమ్మాయిలకి 13 వ ఏట రాగానే డబ్బులకి ఆశపడి పెద్ద వయసు కలిగిన అరబ్ షేక్ లకు ఇచ్చి పెళ్ళి చేయడం..! తర్వాత ఆ ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది?అసలు ఏ ఉద్దేశంతో షేక్ లు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇలాంటి అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటారు? క్రైంలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, పోలీసులకు ఇవన్నీ తెలుసా? తెలిసినా వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుంది? అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.
నటీనటుల పనితీరు: మనోజ్ ముత్యం, వినయ్ వర్మ లు తప్ప జనాలకి తెలిసిన మొహాలు ఏమీ లేవు ఇందులో..! అయినప్పటికీ ప్రతీ ఒక్క పాత్ర ప్రాముఖ్యమైనదే, అన్ని పాత్రలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది.అందరూ తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. అయితే ప్రోమోస్ లో ఎక్కువ కనిపించింది కాబట్టి వైశాలి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఆమె పాత్ర వరకు .. కరెక్ట్ గా సెట్ అయ్యింది, అమాయకపు నటనతో మంచి మార్కులు వేయించుకుంటుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు: పింగిల్ ప్రణవ్ రెడ్డి దర్శకత్వం గురించి ముందుగా చెప్పుకోవాలి. గతంలో ఈయన విమెన్ ట్రాఫికింగ్ పై ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు.క్రిటిక్స్ తో పాటు అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘ఖుబూల్ హై’ వంటి సిరీస్ లో ఈయన మార్క్ బలంగా ఉంటుంది.నిజానికి ఇలాంటి కథని తెరకెక్కించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్న థీమ్ ఇది. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు.
అలాగే ఆయన ఈ సిరీస్ ను ఆవిష్కరించిన విధానం కూడా సహజత్వానికి దగ్గరగా ఉండడమే కాకుండా ఆకట్టుకునే విధంగా, గ్రిప్పింగ్ గా సాగుతుంది. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్ గా ఉంది. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్.. నేపథ్య సంగీతం కూడా క్యూరియాసిటీని పెంచే విధంగా పెర్ఫెక్ట్ గా కుదిరాయి.
విశ్లేషణ: ‘ఖుబూల్ హై’ వంటి సిరీస్ లు చాలా అరుదుగా వస్తాయి. చూస్తున్నంత సేపు ఎంగేజింగ్ గా సాగడమే కాదు, ప్రేక్షకులను ఆలోచింప చేసేవిధంగా కూడా ఉంటుంది. ఆహాలో 6 ఎపిసోడ్స్ గా అందుబాటులో ఉంది. కచ్చితంగా చూడాల్సిన సిరీస్ కూడా..!
రేటింగ్: 3/5