ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోలతో సమానంగా సూర్య సినిమాలకు మార్కెట్ జరిగేది. అతడు ఎన్నుకునే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేవి. దానికి తగ్గట్లు తెలుగులో తన సినిమాలను బాగా ప్రమోట్ చేసుకునేవాడు సూర్య. అయితే గత కొన్నేళ్లలో తన స్థాయికి తగ్గ సినిమాలు చేయడంలో సూర్య విఫలమవుతున్నాడు. దీంతో సూర్య మార్కెట్ బాగా పడిపోయింది. తమిళంలో కూడా ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల హవా బాగా పెరిగింది.
దీంతో తమిళ సినిమాలు ఎంతో గొప్పగా ఉంటే తప్ప మనవాళ్లు ఆ సినిమాలను చూడడం లేదు. ఇలాంటి సమయంలో సూర్య నటించిన ‘ఈటీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు ‘రాధేశ్యామ్’ లాంటి భారీ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సూర్య సినిమాకి పెద్ద ఎత్తున థియేటర్లు లభించాయి. ‘ఈటీ’ సినిమా ఎంత బాగున్నప్పటికీ రెండో రోజు థియేటర్లో ఆడే పరిస్థితి లేదు. కానీ ఈ సినిమా మొదటిరోజు బిగ్ రిలీజ్ ని కూడా వాడుకోలేకపోయింది.
సూర్య సినిమాల విషయంలో మొత్తంగా మన వాళ్లకి ఆసక్తి తగ్గిపోయిందా..? లేక ఏమాత్రం ఆకట్టుకోని టైటిల్, ప్రోమోల వలన దెబ్బ పడిందా..? అనేది చెప్పలేం. కానీ సినిమా తొలిరోజు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మొదటి రోజు ఎక్కడా కూడా హౌస్ ఫుల్స్ పడలేదు. చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ సైతం కనీస స్థాయిలో కనిపించలేదు. మార్నింగ్ షో అయ్యేప్పటికీ పూర్తి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో మధ్యాహ్నం నుంచి థియేటర్లు వెలవెలబోయాయి.
తమిళనాట కూడా ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేదు. డివైడ్ టాక్ వచ్చింది. మొదటి రోజు హౌస్ ఫుల్స్ పడ్డా.. తరువాత సినిమా వీక్ అయ్యేలా ఉంది. వీకెండ్ తరువాత సినిమా నిలవడం కష్టమంటున్నారు.