Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!
- June 9, 2026 / 01:02 PM ISTByFilmy Focus Desk
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి.. అందులో గెలిచిన విజయ్ (Vijay) పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. విజయ్ జోసెఫ్ సీఎంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా రంజక పాలన చేస్తూ వస్తున్నారు. ఇదిలా సాగుతుండగా మరోసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ రానుంది. దానికి కారణం విజయ్ రిజైన్ చేయడమే. రెండు స్థానాల్లో (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) పోటీ చేసి గెలిచిన విజయ్ ఇప్పుడు ఓ స్థానం వదులుకున్నారు. అదే తిరుచ్చి ఈస్ట్. దీంతో త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
Raghava Lawrence
ఈ క్రమంలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ పేరు చర్చలోకి వచ్చింది. త్వరలో లారెన్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుండి లారెన్స్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై లారెన్స్ స్పందించారు. క్లారిటీ ఇచ్చినట్లుగా ఇచ్చిన లారెన్స్ పోస్ట్‌లో క్లారిటీ లేదు. తిరిగి కాస్త కన్‌ఫ్యూజన్‌ను తీసుకొచ్చింది. అయితే 10వ తేదీన క్లారిటీ కచ్చితంగా రాబోతోంది.

తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని అనేక మంది మీడియా మిత్రులు ఫోన్‌లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. జూన్ 10వ తేదీతో ‘బెంజ్’ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు ముఖ్యమైన విషయాన్ని ప్రకటిస్తాను అని ఎక్స్‌లో లారెన్స్ రాసుకొచ్చారు. మరి ఆ రోజు ఏం చెబుతారు, ఆ రోజుకు ఎందుకు విషయం వాయిదా వేశారు అనేది చూడాలి.

ఇక లారెన్స్ విషయానికొస్తే.. నటనతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా ఉంటారు. అమ్మ పేరు మీద అనాథలు, వృద్ధులకు సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ రాజకీయాల్లో వస్తున్నారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి తనకు ఎంతో ఇష్టమైన గురువారం నాడు రాఘవ లారెన్స్ ఏం ప్రకటన చేస్తారా అనేది చూడాలి.
‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ













